కరోనా నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. కొవిడ్ అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాధితులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. లక్షల కొద్ది బిల్లులు వసూలు చేస్తూ పేద ప్రజలను పీక్కు తింటున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు రాకపోవడంతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చేర్చాలని.. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండో వేవ్‌లో ఆస్పత్రి బిల్లుల భారాన్ని సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా చెల్లించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.