గిరిజన విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సునీల్ ఆత్మబలిదానం వృథా కానివ్వబోమన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచి నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారం చేశారని విమర్శించారు.
మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తా: జీవన్‌రెడ్డి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో 7.5శాతం రిజర్వేషన్ ఉంటే.. రాష్ట్రంలో కేవలం 6శాతం మాత్రమే అమలవుతోందని మండిపడ్డారు. చరిత్రలో గిరిజన ద్రోహిగా సీఎం నిలచిపోతారని.. సునీల్ మరణంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆశ్రయిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మరో ఉద్యమం చేయాల్సిన అవసరముందన్నారు. ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు కారణమైన సీఎం కేసీఆర్‌ను చట్టపరంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.