సచివాలయం భవనాల కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇదే విషయమై తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరింది. గత జూన్ 29న హైకోర్టు సచివాలయం కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దీనిపైనే ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
మరోవైపు ఇవాళ హైకోర్టులో కూల్చివేత ఆపాలని తెజస ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. కూల్చివేతలకు సంబంధించిన అనుమతులున్నాయా అని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతుల పత్రాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. దీంతో కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: కూల్చివేత ఎఫెక్ట్: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం విచారం