Congress MLA Candidates List Telangana 2023 : రాష్ట్రంలో అభ్యర్ధుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వచ్చిన స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యుడు బాబాసిద్దిఖీలు ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులతో.. వేర్వేరుగా సమావేశమమ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి వరకు అభిప్రాయ సేకరణ జరిగింది. సీనియర్ నాయకుల ఆలోచనలు, సలహాలు, సూచనలు కమిటీ సేకరించింది. కమిటీ ముందు హాజరైన నాయకులు చెబుతున్న విషయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి.
Congress MLA Candidates Telangana 2023 : బీసీకి చెందిన నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్ యాదవ్, వి.హనుమంతురావు, మధుయాస్కీ తదితరులు బీసీలకు అధిక సీట్లు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీని కోరారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఏయే నియోజకవర్గాలల్లో బీసీలు అధికంగా ఉన్నారు. ఏయే స్థానాలకు బీసీలకు టికెట్లు ఇవ్వొచ్చనే అంశం సహా 34 టికెట్లు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ.. అంతకంటే ఎక్కువ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
CWC Meetings in Hyderabad : హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు.. రాష్ట్రంలోనూ 5 గ్యారంటీలతో రెడీ
Telangana Congress MLA Candidates 2023 : రాష్ట్రం(Telangana Assembly Elections 2023)పై సంపూర్ణ అవగాహన కలిగిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, పార్టీలో చేరికల వల్ల లాభనష్టాలు, కొత్తగా చేరేవాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీ నాయకుల్లో వ్యక్తమయ్యే అసంతృప్తి, సామాజిక సమీకరణాల సమతుల్యత తదితర అంశాలపై కమిటీకి తెలియచేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రాంతాల వారీగా పార్టీ బలాబాలు, అధికార బీఆర్ఎస్ బలాబలాలు ఇలా వివిధ రకాల సమాచారాన్ని కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే సీతక్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పొదెం వీరయ్య ఎస్టీలకు సీట్లు కేటాయింపులో.. ఉప కులాలు పరిగణనలోకి తీసుకుని సమన్యాయం జరిగేట్లు చూడాలని కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ల మేరకు కాకుండా బలమైన నాయకులు ఉన్న చోట జనరల్ సీట్లు కూడా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
మహిళలకు అధిక సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన : కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు అధిక సీట్లు కేటాయించి సముచిత స్థానం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. మహిళ కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు తనకు సికింద్రాబాద్ సీటు కేటాయించాలని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌ను కోరినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో కరీంనగర్, ఖానాపూర్, మహబూబాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, అంబర్‌పేట, చేవెళ్ల స్థానాలను మహిళలకు కేటాయించాలంటూ అక్కడ పోటీ చేయనున్న మహిళ నాయకురాళ్ల పేర్లతో ఓ వినతి పత్రం అందచేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావహుల జాబితా వడపోత నిమిత్తం స్క్రీనింగ్ కమిటీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యుల నుంచి ఇలా వివిధ రకాల సమాచారాన్ని సేకరించింది.
పీసీసీ మాజీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, చైర్మన్లకు టికెట్లు ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలంటూ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గారెడ్డి రెండు లేఖలను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌కు అందచేశారు. మాజీ పీసీసీ అధ్యక్షులు కోరితే టికెట్లు ఇచ్చి వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా టికెట్‌ల కేటాయింపు విషయంలో మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని స్క్రీనింగ్ కమిటీకి చెప్పినట్లు జగ్గారెడ్డి వివరించారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు 35 మంది డీసీసీ అధ్యక్షులు, నలుగురు మాజీ ఎంపీలు, 13 మంది మాజీ మంత్రులు మరికొంత మందితో వేరువేరుగా భేటీ అయ్యి స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయ సేకరణ చేయనుంది. ఎక్కువ మందిని కలవాల్సి ఉండడంతో ప్రతి ఒక్కరికి అయిదు నుంచి 10 నిముషాలు సమయం మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఆయా జిల్లాల పరిధిలో పార్టీ బలాబలాలు, ఇతర పార్టీల బలాబలాలు, దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లో జనాదరణ కలిగిన నాయకుల గురించి ఆయా డీసీసీల ద్వారా ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.