Congress MLA Candidates in Hyderabad 2023 : రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. దాదాపు నాలుగో వంతు స్థానాలు హైదరాబరాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్(BRS), బీజేపీలతో పోలిస్తే కాంగ్రెస్ బలహీనంగా ఉంది. మరో వైపు నియోజకవర్గాల వారీగా నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు తగిని చికిత్స చేసేందుకు పీసీసీ చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ప్రధానంగా ఉప్పల్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, ముషీరాబాద్ తదితర నియోజక వర్గాలల్లో నాయకుల మధ్య ఐఖ్యత కొరవడింది. తరచూ ఆయా నియోజక వర్గాలల్లో నాయకులు, కార్యకర్తల మధ్య వివాదాలు చెలరేగుతుండడం పీసీసీకి తలనొప్పిగా మారింది. నియోజక వర్గాల వారీగా కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు ఆశావహులు సిద్దంగా ఉన్నారు.
Congress MLA Tickets in Hyderabad 2023 : ఖైరతాబాద్ డీసీసీ పరిధిలో కాంగ్రెస్ తరఫున బరిలో దిగేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనుచరుడు.. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గత కొన్నిరోజులుగా జనంలో తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్లుతున్నారు. ఆయన తనకే బీ ఫాం వస్తుందన్నవిశ్వాసంతో ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పీజీఆర్ కుమార్తె, కార్పోరేటర్ విజయారెడ్డి కూడా చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 : నాంపల్లి నుంచి గతంలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్‌ఖాన్ మరొకసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అంబర్‌పేట నుంచి ఓబీసీ సెల్ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ యాదవ్‌లు పోటీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. గోషామహల్ నుంచి కాంగ్రెస్ ఫిషర్మెన్ విభాగం రాష్ట్ర ఛైర్మన్ మెట్టు సాయికుమార్, కార్వాన్ నుంచి ఉస్మాన్ హల్ హజ్రిలు పోటీ పడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సనత్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమైన పీసీసీ ప్రధాన కార్యదర్శి కోట నీలిమా.. నియోజక వర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఆడెమ్ సంతోష్‌తోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన నోముల ప్రకాష్, ఏఐసీసీ సభ్యుడు దీపక్‌జాన్‌లు కూడా బరిలో దిగేందుకు చొరవ చూపుతున్నారు.
Telangana Congress MLA Candidates 2023 : ముషీరాబాద్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ బరిలో దిగేందుకు సిద్దంగా ఉండగా, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ కూడా చొరవ చూపుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటి వరకు అభ్యర్ధి ఎవరు లేరు. హైదరాబాద్ డీసీసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎక్కువ భాగం ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోంది.
ఇక్కడ ఇతర పార్టీలకు చెంది ఎవరు బరిలో నిలిచినా డిపాజిట్లు కూడా దక్కవు. అయినా ప్రతిసారి పోటీ చేసి ఓటిమి పాలవుతుండడం సంప్రదాయంగా మారింది. మలక్‌పేట నుంచి చెట్లోకర్ శ్రీనివాస్, బహుదురపురా నుంచి ఖలీమ్ బాబా, చాంద్రాయణ గుట్ట నుంచి ఇసాబిన్ మిశ్రి, చార్మినార్ నుంచి షేక్ ముజిబుల్లా, యాకుత్‌పురా నుంచి రాజేంద్ర రాజులు బరిలో దిగనున్నారు.
అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 నియోజక వర్గాలల్లో.. ఎల్బీనగర్ నుంచి మల్రెడ్డి రామిరెడ్డి తనకే టికెట్ వస్తుందన్న విశ్వాసంతో.. నియోజక వర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బరిలో దిగేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఇక్కడ కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన వర్తింపచేస్తే మల్రెడ్డి రామిరెడ్డి స్థానంలో మరొకరిని బరిలో దించాల్సి వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Telangana Congress MLA Candidates in GHMC 2023 : ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి తనకే టికెట్ దక్కుతుందన్న విశ్వాసంతో ప్రతి రోజు జనంలోనే ఉంటున్నారు. కాని ఇక్కడ నుంచి బి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. మేడ్చల్ నుంచి హరివర్దన్‌రెడ్డి తనకే టికెట్ వస్తుందన్న విశ్వాసంతో గత రెండు నెలలుగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కాని ఇక్కడ నుంచి బీసీని బరిలోకి దించే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్ధి లేడన్న వాదన వినిపిస్తోంది.
కూకట్పల్లి నుంచి శ్రీరంగం సత్యం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కుత్భుల్లాపూర్ నుంచి భూపతిరెడ్డి నర్సారెడ్డి, కొలను హన్మంతురెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మహేశ్వరం నుంచి రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, దీపా భాస్కర్‌రెడ్డి, పారిజాతరెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. రాజేందర్‌నగర్ నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగి నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. చేవేళ్ల నుంచి ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ బరిలో దిగేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.