Congress Membership Drive: సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా.. అందరూ వారి వారి సొంత నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేసుకోనున్నారు. నేటి నుంచి జనవరి 26 వరకు 30 లక్షల మంది సభ్యత్వం పొందేలా లక్ష్యం పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 34 వేల మందికి పైగా భాగస్వామ్యం కానున్నారు.
ఉద్యమంలా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. అన్ని స్థాయిల నాయకులు సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం కావాలని... తన జన్మదిన వేడుకలు చేసుకోవద్దని పార్టీ శ్రేణులకు, నాయకులకు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారికి సంతాపం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని కేక్ కట్ చేయడం, పూల మాలలు వేయడం, ఆనందోత్సాహాల ర్యాలీలు వంటి ఎలాంటి వేడుకలను చేయవద్దని ఏఐసీసీ ఇన్ఛార్జీ మాణికం ఠాగూర్ సూచించారు. ఆడంబరాలు ప్రదర్శించకుండా సభ్యత్వ డ్రైవ్ కార్యక్రమాలు మాత్రమే చేయాలని.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఇతర ఐఏఎఫ్ సిబ్బందికి నివాళులు అర్పించిన తర్వాతనే సభ్యత్వ డ్రైవ్‌ను ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: దిల్లీలో శుక్రవారం బిపిన్ రావత్ అంత్యక్రియలు