ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) అసలు రంగు బయట పెట్టేందుకు.. క్విట్ ఇండియా రోజు ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత దండోరా కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్(congress) ప్రకటించింది. దళిత బంధు పేరుతో చేస్తున్న మోసాలను బయట పెడతామని టీపీసీసీ(TPCC) ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వెల్లడించారు. గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
కోకాపేట భూముల అవినీతిపై తదుపరి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లు మధుయాష్కీ, జగ్గారెడ్డిలు చెప్పారు. ఇక నుంచి తెరాస ప్రతి అవినీతిపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. కోకాపేట భూములపై ప్రధానమంత్రి, కేంద్రహోంమంత్రి, సీబీఐలకు ఫిర్యాదు చేస్తామన్నారు. పోడు భూములు లాక్కొవడాన్ని అరికట్టడం కోసం ఒక కమిటీ వేశామని... పోడుభూముల రక్షణకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై... శ్వేత పత్రం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ దళితుల కోసం పథకాలు, ఉద్యోగ భర్తీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడా నియామకాలు జరగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం పేరిట మళ్లీ మోసం చేస్తున్నారు. విద్య, వైద్యంపై ఒక్క సమీక్ష చేయలేదు. ఆ మోసాలను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించింది. ఒక్క హుజూరాబాద్ కాదు, రాష్ట్రంలోని మొత్తం దళిత, గిరిజన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌తో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తాం.
-మధుయాష్కీ, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు
అసైన్డ్ భూములను సంగారెడ్డి జిల్లాలో మంత్రులు కొన్నారు. అవి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకున్నా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు అసైన్డ్ భూములను కొన్నారు. ఈ భూములను రక్షించాలి. రైతులకు కాపాడాలి. ఇకనుంచి ఓ కార్యచరణ రూపొందించి పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంది.
-జగ్గారెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు
2019 ఎన్నికల సందర్భంగా పెగాసస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్‌తో కుట్రలు చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ చేసే నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో దెబ్బలు తగిలాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని, హెచ్చార్సీలో, కోర్టుల్లో ప్రైవేట్ కేసు వేస్తామన్నారు. తొలుత దళిత, గిరిజన దండోరా చేపడతామని.. ఆ తర్వాత బీసీ దండోరా ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. అసైన్డ్ భూములను కాపాడాలని కాంగ్రెస్ నిర్ణయించిందని ఆ మేరకే కార్యచరణ చేపడతామని ప్రకటించారు.
ఇదీ చదవండి: CM KCR On Dalit Bandhu: దళిత బంధు కేవలం పథకం మాత్రమే కాదు.. ఓ ఉద్యమం