కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పూర్తి చేయట్లేదని ఆరోపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జలదీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. జలదీక్షలో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల వద్దకు బయల్దేరిన కాంగ్రెస్ నేతల్ని... పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.
నల్గొండలో జలదీక్షకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. చింతప్లలి మండలం గొడుకొండ్ల వద్ద.... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపీ కోమటిరెడ్డి, జానారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జలదీక్షకు వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. పరిస్థితులు అదుపుతప్పుతుండటంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శులు చల్లా వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధించారు. జలదీక్షకు వెళ్లకుండా ముందస్తుగా చర్యల్లో భాగంగా వారిని గృహనిర్భందం చేసినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో పీసీసీ అధికార ప్రతినిది హర్షవర్ధన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు.
కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోలీసులు అరెస్ట్ చేశారు. పాలేరు జలాశయం వద్ద జల దీక్షకు బయలుదేరిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.
నాగర్ కర్నూల్‌లో నాగం జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు అక్రమంగా తరలిస్తున్నరంటూ...కొల్లాపూర్‌లోని ఏల్లూరు వద్ద దీక్ష చేయాలని నిర్ణయించుకున్న నాగంను పోలీసులు అడ్డుకున్నారు. నాగం వెళ్ళకుండా ముందస్తుగానే పోలీసులు అతని ఇంటి వద్దనే అరెస్టు చేసి గృహనిర్బంధం చేశారు. దీంతో ఆగ్రహించిన నాగం పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఇవీ చూడండి: నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష