మాజీ మంత్రి జానారెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి జానారెడ్డి కారణమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
జానారెడ్డికి సీఎం పదవి అవకాశం వచ్చినా తీసుకోలేదని....తనకు సీఎం పదవి ఇస్తే తెలంగాణ రాదని ఆయన స్పష్టం చేశారని షబ్బీర్ అలీ వివరించారు. జానా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో కొడుకులను కుటుంబసభ్యులను కానీ ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. జానారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగ్ రిపోర్టు తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ అయిందన్నారు. పదివేల కోట్ల స్కామ్ జరిగిందని కాగ్ చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి ఏ శాఖలో అవినీతి జరిగిందో తేల్చాలని తెలిపారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ శాశ్వతంగా ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. జానారెడ్డి రాజకీయాలకు ఒక దిక్సూచిలాంటి వారని తెలిపారు. కేసీఆర్ పతనం దుబ్బాక లో ప్రారంభమైందని...నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత నిజమైన రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని మల్లు రవి వివరించారు.
ఇదీ చదవండి: ఆ కుటుంబంలో వారసత్వంగా పుడుతున్న కవలలు