Telangana Politics Latest News : ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీ టీమ్ పదం కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం ఉండటంతో పార్టీలు వ్యూహాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందనే అంచనాలతో తమ ప్రత్యర్థి పక్షాలు రెండూ ఒక్కటేననే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి.. బీఆర్ఎస్ బీ టీమ్ అనే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. దీనిపై రాష్ట్ర నేతలు గులాబీ పార్టీపై విమర్శలు చేస్తుండగానే.. ఖమ్మం జనగర్జన సభలోనూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదే పదాన్ని పలుమార్లు ప్రస్తావించారు. మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ అంటే బీజేపీ రిశ్తేదార్ సమితి అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల కేసుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
Rahul Gandhi B Team Comments On BRS : కాంగ్రెస్ విమర్శలతో ఎన్నికల వేళ ఎలాంటి నష్టం జరగకూడదనే లక్ష్యంతో.. బీఆర్ఎస్ కూడా దీటుగానే స్పందిస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారం జనంలోకి వెళ్లకుండా ఉండేలా వ్యూహాలు అమలు చేస్తోంది. మహారాష్ట్ర పర్యటనలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే అంశంపైన ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్‌ను తమను బీజేపీకు బీ టీమ్ చేస్తే.. బీజేపీ.. కాంగ్రెస్‌కు ఏ టీమ్ చేసిందని.. తాము ఎవరికి బీ టీమ్ కాదని ప్రజల టీమ్ అని స్పష్టం చేశారు.
Rahul Gandhi Speech at Khammam : అటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పైనా బీఆర్ఎస్ నేతలు గట్టిగానే బదులిచ్చారు. బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ కాదని.. మిమ్మల్ని ఢీకొట్టే టీమ్ అంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఎదురుదాడి చేశారు. తమది బీజేపీ బంధువుల పార్టీ కాదని.. మీదే భారత రాబందుల పార్టీ అని విమర్శించారు. ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అంటూ మండిపడ్డారు. పార్లమెంటులోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడింది బీఆర్ఎస్నేనని మంత్రులు, ఎంపీలు స్పష్టం చేశారు.
ఆ రెండింటి డీఎన్ఏ ఒక్కటే..: మరోవైపు బీజేపీ సైతం కేసీఆర్తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం ఉంటే దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎలా గెలుస్తామని.. జీహెచ్ఎంసీ ఎన్నికలో పెద్ద సంఖ్యలో స్థానాలు ఎలా గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి డీఎన్ఏ ఒకటే అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే అని.. కాంగ్రెస్‌కు బీజేపీ ఎంత దూరమో.. బీఆర్ఎస్కు కూడా అంతే దూరమని స్పష్టం చేశారు.
Rahul Gandhi B Team Comments : రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్ అని ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రచారం వల్ల కొన్ని వర్గాల ఓటును కోల్పోవాల్సి వస్తుందని.. అలా జరగకూడదని బీజేపీపై పోరాడుతోందని తామేనని బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని చెబుతూ వస్తున్న కమలనాథులు.. బీ టీమ్ విమర్శల వల్ల నష్టం జరగకూడదని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇలా మూడు పార్టీల ఏ, బీ టీమ్ ఆరోపణాస్త్రాలు రాష్ట్ర రాజకీయాల్ని ఆసక్తికరంగా మార్చేశాయి.
ఇవీ చదవండి: