రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. గ్రేటర్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోలేదని , తెరాసకు అనుకూలంగా పనిచేసిందని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఎన్నికల సంఘం ఉండటం వల్ల ప్రజాధనం వృథా అయ్యిందని ధ్వజమెత్తారు. తెరాస నాయకుల ఒత్తిడికి ఈసీ తల వంచిందని, మిగతా పార్టీలు ఇచ్చిన సలహాలు తీసుకొనే పరిస్థితిలో ఈసీ లేదని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ విఫలమైందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.
వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కొవిడ్‌తో అవస్థలు పడుతున్నారని ఎన్నికలకు కొంత సమయం ఇవ్వాలని కోరినా పెడచెవిన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన సర్య్కులర్ అర్థరహితమని మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తి ఓటు కూడా ఒక పోలింగ్ కేంద్రంలో పడిందంటే.. సిబ్బంది ఎలా పని చేశారో అర్థమవుతుందన్నారు. పార్లమెంట్‌లోనూ ఓటు వేసి మరల జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓటు వేయడం చట్టప్రకారం విరుద్ధమని ఆక్షేపించారు. ఓటమిపై పార్టీలో సమీక్షించుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: ఎస్ఈసీ పార్థసారథి రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్