నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ తరఫున తాను పోటీ చేస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ప్రకటించారు. ఆదర్శ రాజకీయాలకు సంకేతంగా తనను గెలిపించాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు. ప్రతిపక్ష ధర్మాన్ని నిర్వర్తించటానికి తాను పనిచేస్తానని జానారెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నారు. సీఎం కేసీఆర్‌పై జానారెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పడల్లా హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. కేసీఆర్ ఆవేశంతో, అనాలోచితంగా హామీలు ఇస్తారని అమలు మాత్రం చేయరని ఎద్దేవా చేశారు.
మా ఊరికి భగీరథ నీళ్లు రావడం లేదు..
ఎస్సీలకు భూములు ఇస్తామని.. ఇప్పటికి రాష్ట్రంలో 10 వేల ఎకరాలు కూడా పంచలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే సీఎం ఓట్లు అడగనన్నారని, ఇప్పటికి తమ ఊరికి భగీరథ నీళ్లు రావడం లేదని, ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. కేసీఆర్ చేసిన శంకుస్థాపన పనులను ప్రతిపాదించింది తానేనని.. సీఎం విమర్శలకు ఉప ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
రైతు రుణమాఫీ ఏమైంది..?
మంచి పనిని అభినందించండి అని చెప్పే తెరాస.. కాంగ్రెస్ అభివృద్ధిని అభినందించరా అని ప్రశ్నించారు. రైతు బంధుని అభినందిస్తున్నామని.. కానీ రైతు రుణమాఫీ ఏమైందని నిలదీశారు. తాను కేసీఆర్‌లా పదవిని తృణీకరించనని... అధికారం కోసం కాదని.. ఆదర్శ రాజకీయాలకు సంకేతంగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని... ప్రజల అభిప్రాయాలు అమలు చేస్తే భాజపాకి మంచిదని హితవు పలికారు.
ఇదీ చదవండి: ఫార్మసీ విద్యార్థిని అత్యాచార ఘటనలో నాటకీయ పరిణామాలు