Congress Focus on Greater Hyderabad MLA Seats : గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగర పరిధిలో (Greater Hyderabad) ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేని కాంగ్రెస్.. ఈ సారి ఈ స్థానాలపై ప్రత్యేక దృష్టిసారించింది. జీహెచ్ఎంసీ సహా నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 28 నియోజక వర్గాలు.. యాదాద్రి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇబ్రహీంపట్నం స్థానాలపై గురిపెట్టింది ఇక్కడ కొన్నిఅసెంబ్లీ స్థానాల్లో బలమైన నేతలు ఉండడంతో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది.
Telangana Congress MLA Candidates Selection : మరికొన్నింటి విషయంలో బలమైన నేతలు లేక ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో.. మల్కాజిగిరి మైనంపల్లి హన్మంతరావుకు (Mynampally Hanumantha Rao)ఇవ్వాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. మేడ్చల్‌లో హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్‌ల మధ్య పోటీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్‌లో కొలను హనుమంతురెడ్డి, భూపతిరెడ్డి నరసారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చే పనిలో పడింది.
కూకట్‌పల్లి నుంచి శ్రీరంగం సత్యం పోటీకి ఆసక్తి కనబరుస్తున్నప్పటికి.. ఇంకా మెరుగైన నాయకుని కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు సమాచారం. ఉప్పల్‌లో రాగిడి లక్ష్మారెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు పోటీ పడుతుండగా.. అక్కడ నుంచి మహిళను బరిలో దింపాలని యోచిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి బరిలో దిగేందుకు మల్‌రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్ రెడ్డిలు టికెట్ ఆశిస్తుండగా.. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ (Madhu Yaskhi) కూడా దరఖాస్తు చేశారు. దీంతో స్క్రీనింగ్ కమిటీలో లోతైన చర్చ జరిగిన తరువాతపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections 2023 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఇప్పటికే పార్టీలో చేరిన ఎస్సీ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని.. ఏడు నియోజక వర్గాల్లో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో మూడు స్థానాల్లో జటిలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ నుంచి పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ నుంచి ఆడెం సంతోష్, సనత్‌నగర్ నుంచి కోట నీలిమ, నాంపల్లి నుంచి ఫిరోజ్‌ఖాన్‌ల పేర్లు దాదాపు ఖారారైనట్లు సమాచారం.
అంబర్‌పేట నుంచి ఓబీసీ ఛైర్మన్ శ్రీకాంత్‌గౌడ్, లక్ష్మణ్ యాదవ్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు తాను సూచించిన లక్ష్మణ్ యాదవ్‌కు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అయితే ముషీరాబాద్‌లో యాదవ వర్గానికి టికెట్ ఇచ్చినందున.. ఇక్కడ తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. శ్రీకాంత్ గౌడ్‌కు టికెట్ ఇవ్వడాన్ని అడ్డుకుంటున్న హనుమంతురావును మరొక పేరు సూచించాలని స్క్రీనింగ్ కమిటీ కోరినట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి,.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు పోటీ పడుతున్నారు. అయితే సునీతా రావు గోషామహల్ నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరితో స్వయంగా రేవంత్ రెడ్డినే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, అజారుద్దీన్‌లు (Azharuddin) పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ కూడా ఇద్దరితో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే రంగంలోకి దిగి మరొక స్థానం ఎంచుకోవాలని అజారుద్దీన్‌ను కోరినట్లు తెలుస్తోంది.
Congress Bus Yatra in Telangana : బస్సు యాత్రకు కాంగ్రెస్ ప్లాన్.. త్వరలోనే రూట్‌మ్యాప్, షెడ్యూల్
Hyderabad Parliament Constituency MLA Tickets : హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో.. కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహుదూర్‌పురా, మలక్‌పేట ఉన్నాయి. ఇందులో కార్వాన్ నుంచి యూసఫ్ అప్సర్‌జాహీ,.. గోషామహల్ నుంచి మెట్టు సాయికుమార్, ఆనందరావు, జిలానీలు పోటీ పడుతుండగా.. ఇంతకంటే బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. మలక్‌పేట నుంచి చెట్లోకర్ శ్రీనివాస్ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉండగా.. అక్కడ కూడా బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో పేరుకే పోటీ ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మహేశ్వరం నుంచి పారిజాత నర్సింహారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ కూడా ఇంతకన్నా బలమైన నాయకుడు పోటీ చేసేందుకు ముందుకొస్తే.. అభ్యర్థి మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాజేంద్రనగర్ నుంచి పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ పోటీ చేసేందుకు చొరవ చూపుతున్నారు. ఇక్కడ కూడా బలమైన అభ్యర్థి అవసరం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
శేరిలింగంపల్లి నుంచి రఘునాథ్ యాదవ్, జర్రిపాటి జయపాల్‌ల సర్వేలు దాదాపు సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాని ఇక్కడ ఆ ఇద్దరికంటే మెరుగైన అభ్యర్థి ఎవరు రానట్లయితే.. వారిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చేవెళ్ల నుంచి షాబాద్ దర్శన్, భీం భరత్, వసంత టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అయితే పంచాయతీరాజ్ సంఘటన్ ఛైర్మన్ సిద్దేశ్వర్‌కు టికెట్ ఇవ్వాలని.. రాష్ట్ర పరిశీలకురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
Competition For Congress MLA Tickets : పరిగి నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, తాండూర్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలకు టికెట్ దాదాపు ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. అదేవిధంగా భువవనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజక వర్గం నుంచి.. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, దండెం రామిరెడ్డిలు టికెట్లు ఆశిస్తుండగా వారిద్దరిలో ఒక్కరికి టికెట్ దక్కుతుందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పని చేసే వాతావరణ కల్పించేందుకు కాంగ్రెస్ నాయకులు సమాలోచనలు జరుపుతున్నారు.