Congress Field work stalled to candidates List Late : తెలంగాణ రాష్ట్రంలో 55 నియోజక వర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన 64 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. రెండు రోజులు క్రితం స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల ఎంపికపై సమావేశమైనా కూడా కసరత్తు పూర్తి కాలేదు. గత నెలలో సీడబ్ల్యూసీ సమావేశాలు(CWC Meetings), తుక్కుగూడ సభ ముగిసిన తరువాత దాదాపు నెల రోజులుగా టికెట్ల కోసం ఆశావహులు.. కాంగ్రెస్ పెద్దల ప్రసన్నం కోసం తిరగడానికే సరిపోతుంది.
దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి: రాహుల్‌గాంధీ
ఈ నెల 15వ తేదీన ఏఐసీసీ 55 టికెట్లు ప్రకటించగా మరో 64 స్థానాలకు చెందిన అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి వస్తాయో తెలియని అయోమయంలో నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు నియోజక వర్గాల్లో తిరుగుతూ.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లు, చేయూత పెన్షన్, సోనియాగాంధీ(Sonia Gandhi) ప్రకటించిన ఆరు గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్తూ వచ్చారు. కానీ మొదటి జాబితా విడుదలయ్యే వరకు తమకే టికెట్లు వస్తాయని భావించి పని చేసిన నాయకులు.. వారం, పది రోజులుగా నియోజక వర్గాల్లో పర్యటనలు కాని.. ప్రచారం కాని చేయకుండా మిన్నకుండి పోతున్నారు.
జానారెడ్డి నేతృత్వంలో బుజ్జగింపుల పర్వం..: ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న 55 నియోజకవర్గాల్లో సైతం.. టికెట్ రాని ఆశావహులు నుంచి వ్యతిరేకత భగ్గుమంటోంది. వివిధ నియోజక వర్గాల్లో అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులను బుజ్జగించే పనిని జానారెడ్డి నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీ చేపట్టింది. ఇప్పటికే మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో మంతనాలు జరపడంతో పాటు.. ఆయనను రాహుల్ గాంధీతో(Rahul Gandhi) కలిపించి, బుజ్జగింప చేసినట్లు తెలుస్తోంది.
కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు టికెట్ రావడం.. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన జగదీశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి కమిటీ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. ఏఐసీసీ(AICC) నుంచి హామీలు ఇప్పించారు. ఎట్టకేలకు ఆయనకు, జూపల్లికి మధ్య సయోద్య కుదిర్చారు. పార్టీని వీడకుండా నిలుపుదల చేయగలిగారు. మీడియా ముందు ప్రవేశ పెట్టి ఇద్దరం కలిసి పని చేస్తామని జానారెడ్డి నేతృత్వంలో వెల్లడించారు.
Congress Candidates 2nd List Delay : అదేవిధంగా మరికొన్ని నియోజక వర్గాల్లో టికెట్ రాని నాయకులు సహాయ నిరాకరణలో ఉండడంతో.. టికెట్ వచ్చిన వారు కూడా ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో నియామకమైన పరిశీలకులు, జానారెడ్డి కమిటీ సభ్యులు బుజ్జగించే పనిలో ఉండగా.. ఇబ్బందులు లేని నియోజక వర్గాల్లో నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇప్పటికే టికెట్ దక్కించుకున్న 55 మంది నాయకులకు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు సంబందించి 20వేల కార్డులను పీసీసీ పంపిణీ చేసింది.
టికెట్లు ప్రకటించాల్సిన 64 నియోజక వర్గాలకు చెందిన నాయకులు.. మాత్రం తమ టికెట్లు ఎప్పుడు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులను(Screening Committee Members), పార్టీలో పెద్దలను కలుస్తూ.. టికెట్ తమకే వచ్చేట్లు చూడాలని కోరుతున్నారు. నియోజక వర్గాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రచారాలు అసలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో నియోజక వర్గాల్లో ఇప్పటి వరకు కార్యకర్తలకు అండగా ఉన్న నాయకులు సైతం టికెట్ల వేటలో ఉన్నారు. ఏదైనా జరిగితే తమకు అండగా నిలిచే నాయకులు లేరని పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ విషయం పీసీసీ, ఏఐసీసీల దృష్టికి వెళ్లడంతో.. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేందుకు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది.