Congress On Telangana Assembly Elections : ఓ వైపు పార్టీలో చేరికలు.. మరోవైపు జాతీయ నేతల బహిరంగ సభలతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీలో మొదటి శ్రేణి నాయకత్వం బలంగా ఉన్నప్పటికీ.. ద్వితీయ శ్రేణిలో నాయకుల కొరత ఉన్నట్లు గుర్తించిన కాంగ్రెస్ నాయకత్వం.. గ్రామస్థాయి నుంచి గాంధీభవన్ వరకు పార్టీ పటిష్ఠంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కమిటీల నియామకం ఇప్పటికీ పూర్తికాగా.. మిగిలిన 39 స్థానాల్లో వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు గాంధీభవన్‌లో బూత్ లెవెల్ మేనేజ్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Congress Booth Level Management Program : యాక్టివ్‌గా ఉన్న బూత్ ఎన్‌రోలర్స్‌ను బీఎల్వోలుగా నియమించుకోవాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. బూత్‌లు మార్చి ఓటరును గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తారని.. ఇలాంటి వాటిని ఎదుర్కోవటంలో బూత్ లెవల్ ఎజెంట్లే కీలకమని చెప్పారు. ఈ నెల 15లోగా మండల, డివిజన్‌లు పూర్తి చేయాలని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు.. 18న మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Telangana Congress Master Plan : మరోవైపు.. దేశవ్యాప్తంగా అధిక శాతం జనాభా కలిగిన వర్గాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసి, సామాజిక న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా ఏఐసీసీస ముందుకెళ్తున్న నేపథ్యంలో లీడర్‌షిప్ డెవలెప్‌మెంట్ మిషన్ పేరుతో ఇటీవల దిల్లీలో జాతీయ స్థాయి సమావేశం జరిగింది.
Telangana Assembly Elections 2023 : 18 రాష్ట్రాల్లోని 80 రిజర్వుడ్ స్థానాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్గనైజేషన్ల నాయకులతో సమావేశమైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర జాతీయ నేతలు.. అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. కాగా.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్‌డ్ స్థానాలు ఉండగా బీసీలకు ఆ అవకాశం లేనందున.. జనాభాలో అత్యధిక శాతం కలిగిన ఈ వర్గాలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా వర్గాల్లో నాయకత్వాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతీ నెల మొదటి వారంలో సమావేశాలు నిర్వహించి.. రెండో వారంలో నివేదికలు ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలకు ఏఐసీసీ స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలను ప్రయోగాత్మకంగా ఎంచుకున్న కాంగ్రెస్ జాతీయ నాయకత్వం.. ఆ దిశగా ముందడుగు వేస్తోంది.
మరోవైపు.. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ తమ నేతలకు పిలుపునిచ్చింది. ఓట్ల తొలగింపులాంటి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలంటున్న పీసీసీ.. రానున్న 120 రోజులు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పనిచేస్తేనే అధికారంలోకి వస్తామని క్యాడర్‌ను సంసిద్ధుల్ని చేస్తోంది.
ఇవీ చదవండి: