congress diksha on kcr comments: భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ.... కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. మరోవైపు గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు 48గంటలపాటు దీక్షలో కూర్చున్నారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో పాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, పీసీసీ ఎస్సీసెల్ ఛైర్మన్ ప్రీతం తదితరులు దీక్షలో పాల్గొన్నారు. గాంధీభవన్ ఆవరణలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో సీఎం కేసీఆర్ శవయాత్ర నిర్వహించారు. నాంపల్లి సర్కిల్ వద్ద శవయాత్ర నిర్వహణకు ప్రయత్నం చేయగా గేటు వద్దనే పోలీసులు అడ్డుకున్నారు.
'రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఇప్పుడిలా మాట్లాడతారా..?'
ponnala lakshmaiah on cm kcr: ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో కాలానుగుణంగా మార్పులు అవసరమైనప్పుడు పార్లమెంటు ద్వారా సవరణలు చేసుకునే వెసులుబాటు ఉందని... ఇప్పటి వరకు వందకుపైగా సవరణలు చేసుకున్నామన్నారు. ఇప్పడున్న రాజ్యాంగంలోని మూడో అధికరణం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిందనేది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చినందునే కదా....కేసీఆర్ సీఎం కాగలిగిందని ఆయన ప్రశ్నించారు. భాజపా తెరాసలు రెండు కలిసి రాజకీయం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ మాట్లాడిన భాషపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
congress protest : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు నిర్వహించి... అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. మహబూబాబాద్‌లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో ఆందోళన చేశారు. ప్రజా వ్యతిరేకతతో సీఎం ఇష్టారీతిన మాట్లాడుతున్నారంటూ... బోయిన్‌పల్లిలో నిరసన చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నిరసనలో పాల్గొన్నారు. ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: BJP Bheem Deeksha: 'కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ కుట్ర'