జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. దేశ విద్యారంగంలోనే ఇది అసామాన్యమైనదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎంబీబీఎస్‌లో తెలంగాణకు అధిక సంఖ్యలో సీట్లు వచ్చాయని తెలిపారు. మనం ఏ రంగం నుంచి వచ్చామో.. ఆ రంగానికి సేవ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి సూచించారు. జాతీయ పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్, ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించిన గురుకులాల విద్యార్ధులకు.. నగరంలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అభినందన సభ జరిగింది.
సువర్ణ అధ్యాయం
గురుకుల విద్యాలయాల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఇక్కడ బోధన కొనసాగుతోందని తెలిపారు. విద్యతో పాటు వివిధ అంశాల్లో గొప్పగా రాణిస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు.
మట్టిలో మాణిక్యాలు
ఈ సంవత్సరం దేశంలోనే కష్టతరమైన ఐఐటీ-జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 135 మంది పేద విద్యార్థుల కల నిజమైందని రాష్ట్ర గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. సంక్షేమ విద్యాలయాల చరిత్రలోనే తొలిసారిగా 80 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధించగా.. ఈ ఏడాది ఎంబీబీఎస్‌లో అధిక సంఖ్యలో విద్యార్థులకు సీట్లు లభించాయని వివరించారు. వీరంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లని తెలిపారు. ఈ సందర్భంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ. 50 వేల చొప్పున చెక్కులు అందజేశారు.
ఇదీ చదవండి: 'అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం'