- వనస్థలిపురం జింకల పార్కు వద్ద ఉండే ఓ ప్రైవేటు ఉద్యోగి 4 రోజుల కిందట నలుగురు కుటుంబ సభ్యులతో సహా వెళ్లి యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు ఒక్కరికే పాజిటివ్, మిగిలిన వారికి నెగిటివ్ వచ్చింది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి ఉన్నారు. మూడు రోజుల్లోనే వారిలో ఇద్దరికి తీవ్ర కరోనా లక్షణాలు బయటపడడంతో మళ్లీ యాంటీజెన్ పరీక్ష చేయాలని సంబంధిత కేంద్రం వైద్యుణ్ని సంప్రదించారు. ఈ పరీక్షతో ఫలితం సరిగా రాదు.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోండని ఆయన సలహా ఇచ్చారు.
- ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రెండుసార్లు యాంటీజెన్ పరీక్ష చేయించుకున్నా నెగిటివ్ వచ్చింది. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 4 రోజులకే ఆరోగ్యం విషమించింది. ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయిస్తే కరోనాతో పాటు నిమోనియో ఉందని, ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణహాని ఉంటుందని వైద్యులు హెచ్చరించడంతో వెంటనే చేరారు.
హైదరాబాద్ నగరంలో జరిగే కరోనా పరీక్షల్లో అస్పష్టత నెలకొంటోంది. 85 శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇచ్చే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్ చైన్ రియాక్షన్(ఆర్టీ పీసీఆర్) పరీక్షలను చాలా వరకు తగ్గించిన అధికారులు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలనే చేస్తున్నారు. ఇవి 60 శాతం కచ్చితత్వంతో ఉంటున్నాయి. కరోనా లక్షణాలున్న వారికీ నెగిటివ్ వస్తోంది. అనుమానితులు బయట తిరుగుతూ ఇతరులకూ అంటిస్తున్నారు. రెండు రోజులకే కరోనా లక్షణాలు తీవ్రమై ఆరోగ్యం విషమిస్తోంది.
ఆ పరీక్షలే చేయాలి
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి గాంధీతోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ఆయుర్వేద, నేచర్‌క్యూర్‌లాంటి సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెద్దఎత్తున చేశారు. ఫలితం 85 శాతం వరకు కచ్చితత్వంతో ఉండటంతో చిన్నపాటి లక్షణం ఉన్నా పాజిటివ్‌గా చూపించేది. ఫలితాలు రావడానికి ఒకట్రెండు రోజులు ఆలస్యమైనా, వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య ప్రక్రియ మొదలుపెట్టడానికి ఆస్కారముండేది. తద్వారా 95 శాతం వరకు బాధితులు కోలుకొనేవారు. గత పది రోజులుగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలను దాదాపు నిలిపివేశారు. కేవలం ఉస్మానియా, గాంధీ, ఫీవర్, సీసీఎంబీ, ఐపీఎం, నిమ్స్ లాంటి ఆస్పత్రుల్లోనే చేస్తున్నారు. గతంలో ఫీవర్ ఆసుపత్రిలో రోజుకు దాదాపు 100-150 పరీక్షల చేయగా ఇప్పుడు అయిదారు మాత్రమే చేస్తున్నారు. నిమ్స్‌లో వైద్యులు సిఫారసు చేసినవారికి మాత్రమే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వాటితో కచ్చిత ఫలితం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు ఆరేడువేల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ప్రతి అనుమానితుడికి ఈ పరీక్షలు అందుబాటులో ఉంచితే కచ్చితమైన ఫలితం వచ్చి గందరగోళానికి గురికాకుండా వెంటనే వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ప్రైవేటు పరీక్షలు కానీ.. ఆర్టీ పీసీఆర్ కానీ?
యాంటీజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చిన రెండు రోజులకే కరోనా లక్షణాలు తీవ్రమవుతుండడంతో అనేకమంది మళ్లీ యాంటీజెన్ పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడి వైద్యులు ఆర్టీ పీసీఆర్ పరీక్ష గానీ, ప్రైవేటు ల్యాబ్‌ల్లో గానీ పరీక్ష చేయించుకోండని సలహా ఇస్తున్నారు. అప్పటికప్పుడు ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకునే అవకాశం లేకపోవడంతో వందలాది మంది ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేసి కరోనా ఫలితాలను ప్రైవేటు ల్యాబ్‌లు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చదవండి: భారత్ బయో 'కొవాక్జిన్' పరీక్షలు వేగవంతం