ఇంజినీరింగ్ రుసుముల వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తోంది. ఓ వైపు అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ... ప్రభుత్వం ఇప్పటికీ ఫీజులను ఖరారు చేయలేదు. మరోవైపు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లి తాము ప్రతిపాదించిన భారీ రుసుములు వసూలు చేసుకునేలా అనుమతి తీసుకున్నాయి.
ఈనెల 24 నుంచి విద్యార్థులు ఆన్లైన్లో స్లాట్ బుక్కింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 37 వేల 909 మంది ప్రాసెసింగ్ రుసుము చెల్లించారు. నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జులై 4 వరకు విద్యార్థులు ఏ కాలేజీలో, ఏ కోర్సులో చేరుతారో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులపై స్పష్టత రాకపోవడం వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర ప్రవేశాల, రుసుముల నియంత్రణ కమిటీకి ఛైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాలేజీలు తాము ప్రతిపాదించిన రుసుములే వసూలు చేసుకునేందుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
ప్రస్తుతానికి కాలేజీలు ప్రతిపాదిత రుసుములు తీసుకోవచ్చునని... తర్వాత ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులకే కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఇప్పుడు మాత్రం విద్యార్థులు భారీగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని భావిస్తున్న విద్యా శాఖ... కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతుల కోసం వేచి చూస్తోంది.
ఒకవేళ అప్పీల్ వెళ్లినప్పటికీ... రేపటిలోగా స్పష్టత వచ్చే అవకాశం అనుమానమేనని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. లేదంటే హైకోర్టు ఆదేశాలను వెబ్ సైట్లో పేర్కొని... దానికి అనుగుణంగా కౌన్సెలింగ్ కొనసాగించాలని ఆలోచిస్తున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ సహకారం... యువకుడు స్వస్థలం చేరిన వైనం