conflict in telangana congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిలావాలా పెల్లుబుకుతోంది. అసలైన కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అంటూ రెండు వర్గాలుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పీసీసీ జంబో కమిటీలు ప్రకటనతో అంతర్గతంగా ఉన్నఅసంతృప్తి బహిర్గతం అవుతోంది. గత కొన్ని రోజులుగా నాయకుల్లో ఉన్న అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. అసంతృప్తివాదులంతా ఏకమై కమిటీలు వేయడంలో జరిగిన అన్యాయాన్నిఅధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శులు కలిసి వేసిన జంబో కమిటీలు పార్టీలో కుంపటిని రగుల్చుతున్నాయి. నాలుగు రోజుల కిందట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతురావు, మాజీ మంత్రి గీతా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావులు కలిసి కమిటీల్లో జరిగిన అన్యాయంపై చర్చించారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క కమిటీల కూర్పులో తనకు భాగస్వామ్యం కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం భట్టి ఇంట్లో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. శనివారం ఉదయం తిరిగి భట్టి నివాసంలో సీనియర్ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మధుయాస్కీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు తదితరులు సమావేశమై దాదాపు మూడు గంటలపాటు కమిటీల కూర్పు, పీసీసీ డెలిగేట్ల ఎంపిక తదితర వాటిపై చర్చించారు.
అదేవిధంగా పార్టీ నాయకుల్లో కొందరిపై కోవర్టులు అన్నముద్ర వేస్తున్నారని, సామాజిక మాద్యమాలల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని కూడా కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన నాయకులు.... పార్టీలో జరుగుతున్న తాజా పరిస్థితులు, కమిటీల కూర్పు తదితర అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
''పీసీసీ కమిటీల కూర్పులో తాను పాలుపంచుకోలేదు. అందుకే తనను కలిసేవారికి న్యాయం చేయలేకపోతున్నా. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా. కాంగ్రెస్ పార్టీని రక్షించుకునేందుకు చొరవ చూపాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న నాయకులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఏడాదిన్నరగా జరుగుతోంది.'' - భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత
సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ, జగ్గారెడ్డి, దామోదర్ రాజనర్సింహలు వెల్లడించారు. కమిటీలో అసలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నష్టపోయారు. తనకు కూడా పెద్ద సంఖ్యలో నాయకులు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కొందరు తనతో కలుస్తున్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పార్టీలో న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నందున తాను కూడా మనస్థాపానికి గురవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కి మూల స్తంభాలుగా ఉన్ననాయకులపై సామజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారు.
‘‘నేను చాలాకాలం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. జిల్లా అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ గెలిచే ప్రాంతాల్లో ఏకాభిప్రాయం రాలేదు. 33 జిల్లాల్లో 26 చోట్ల నియమించి 7 చోట్ల ఆపడం సరికాదు. కమిటీల్లో ఎక్కువగా బయట నుంచి వచ్చిన వారికే స్థానం కల్పించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరిగింది. ఈ విషయంపై త్వరలోనే మేమంతా అధిష్ఠానాన్ని కలుస్తాం. ఇక్కడి పరిస్థితులను తెలియజేస్తాం’’ -ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీపీసీసీ
కాంగ్రెస్ పార్టీ భావజాలాన్నిరక్షించుకోడానికి అందరం కలిసి పని చేయాల్సి ఉందన్నారు. తాను కూడా కూడా చాలా కాలంగా పీసీసీ అధ్యక్షుడు గా ఉన్న ఇలాంటి పరిస్థితులు లేవని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో కాంగ్రెస్ గెలిచే ప్రాంతాలల్లో ఏకాభిప్రాయం రాలేదని ఆపేశారని ఆరోపించారు. త్వరలో అధిష్ఠానాన్ని కలిసి ఇక్కడి పరిస్థితులను తెలియచేస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తివాదులు గళం పెంచారు. వలసవాదుల కారణంగా అసలైన కాంగ్రెస్ నాయకులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఒరిజినల్ నాయకులకు, కార్యకర్తలకు జరుగుతున్నా... అన్యాయాన్ని ఎలా కాపాడుకోవాలన్నదే తమ ఆవేదనని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే దిశలోనే తమ తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఉంటున్న నాయకులను కోవర్టులు అని ముద్ర వేయడంలో అర్థం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ పోటీ చేయవద్దన్నా... ముఖ్యమంత్రి జిల్లాలో పోటీ చేయకుంటే పార్టీ పరువు పోతుందని తన భార్యను ఎమ్మెల్సీగా బరిలో దింపిన తాము కోవర్టులం ఏలా అవుతామని ప్రశ్నించారు.
మరోవైపు ఈ విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ కార్యక్రమాలకు హాజరు కాకూడదని పాత నాయకులంతా నిర్ణయించారు. రేపటి పీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరు కాకూడదని అసంతృప్తులు భావిస్తున్నారు. అధిష్ఠానమే పిలిపించి మాట్లాడుతుందని భావిస్తున్నారు. మరోవైపు అసంతృప్తిలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వకూడదని పీసీసీ భావిస్తోంది.
ఇవీ చూడండి: