కొత్త యాసంగి(Rabbi) సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో వరిసాగు గణనీయంగా తగ్గించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందు కోసం గత నెల చివరివారంలో గ్రామగ్రామానా రైతులతో అవగాహనా సదస్సులు (Awareness meetings) నిర్వహించి రైతులను చైతన్య పరిచింది.
గతేడాది యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలైతే 52.78 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి గణనీయంగా తగ్గించాలన్నది లక్ష్యం. ప్రతీ రైతు పూర్తిగా మానేయకున్నా ఆయన సాగుచేసే విస్తీర్ణంలో సగమైనా ఇతర పంటలు వేసేలా అవగాహన సదస్సుల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈఓ) సూచించారు. ఇతర పంటలు వేస్తే వాటిని ఎవరు కొంటారని కొన్ని చోట్ల రైతులు ప్రశ్నించినట్లు పలువురు ఏఈఓలు చెప్పారు.
వరి సాగుచేస్తే తమ గ్రామాల్లో ఏర్పాటుచేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతుధరకు అమ్ముకుంటామని, ఇతర పంటలైతే అలా కుదరదని.. పూచీకత్తు ప్రభుత్వం ఇస్తుందా అని రైతులు ప్రశ్నించారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం పోలేపల్లి పరిధిలో రైతులు యాసంగిలో వరిసాగు మానేయడం కుదరదని చెప్పారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా చేయకున్నా సొంతానికి వాడుకుంటామన్నారు.
వరికి బదులు ఇతర పంటలు..
రాష్ట్రంలో 25 లక్షలకుపైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి కింద యాసంగిలో అధికశాతం మంది రైతులు వరి సాగుచేస్తారు. ప్రతీ బోరు కింద వరికి బదులు ఇతర పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని ప్రభుత్వం సూచిస్తోంది. బోర్ల కింద వరి సాగు వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. వరినాట్లు నవంబరు నుంచి జనవరి చివరి వరకు వేస్తారు.
ఈ వరి పైరు పెరిగి పొట్ట దశ, గింజ గట్టిపడే మార్చిలో ఎండల తీవ్రత 40 డిగ్రీలకు చేరుతోంది. అంతటి ఎండలను వరి పైరు తట్టుకోలేదు. దాన్ని బతికించుకోవడానికి బోర్ల నుంచి నీరు రోజంతా పొలానికి పారిస్తున్నారు. బోర్ల వినియోగం వల్ల గత ఏప్రిల్ 3న తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా 28.30 కోట్ల కరెంటు వినియోగమైంది. ఇందులో సగం వ్యవసాయానికి సంబంధించే ఉంది. పైగా వేసవి ఎండలకు పండించే పంట నుంచి వచ్చే ధాన్యాన్ని మర పట్టించినప్పుడు నూక అధికంగా వస్తోంది. దీన్ని అధిగమించడానికి ధాన్యాన్ని నానబెట్టి ఉప్పుడు బియ్యంగా మారుస్తున్నారు. ఈ బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం చెబుతున్నందున బోర్ల కింద వరిసాగును పూర్తిగా మాన్పించాలని ప్రభుత్వం చెబుతోంది.