రాష్ట్రంలో ఏరువాక సాగుకు అవసరమైన చర్యలను వ్యవసాయశాఖ తక్షణం చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. వానాకాలం ప్రారంభమైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. హైదారాబాద్‌లోని బషీర్‌బాగ్ వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ఇతర సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందనరావు, విత్తన విభాగం ఇంఛార్జీ కొర్రపాటి శివప్రసాద్‌ను కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. విపతి పత్రాన్ని సమర్పించారు.
వానాకాలం ప్రారంభమవ్వడంతో రైతుల సౌకర్యార్థం రైతుబంధు సహాయాన్ని తక్షణమే అందజేయాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు తీగల సాగర్ కోరారు. ఇప్పటికీ పట్టాదారు పాసు పుస్తకాలు లేవనే సాకుతో 10 లక్షల మంది పేద రైతులకు రైతుబంధు వర్తించడం లేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కల్తీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి మూడ శోభన్, రాష్ట్ర నాయకుడు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పేట్రేగిపోతున్న నకిలీ విత్తన మఠాలు.. నిరాశలో అన్నదాతలు