వ్యాపారులకు మాత్రమే చక్ర వడ్డీని మాఫీ చేసి రైతులకు చేయకపోవడమేంటని... తెలంగాణ రైతు సంఘం ప్రశ్నించింది. తక్షణమే కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవసాయ రుణాలపై కూడా చక్రవడ్డీని మాఫీ చేయాలని డిమాండ్ చేసింది. రైతులు తీసుకున్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయడం లేదని శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం పట్ల ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పెసరగాయల జంగారెడ్డి, తీగల సాగర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వ్యవసాయ రుణాలు పొందిన రైతులపై ప్రతి 6 మాసాలకు ఒకసారి జూన్ 30న, మార్చి 31న వడ్డీని లెక్కగట్టి అసలులో కలుపుతారని... ఆ వడ్డీకి తిరిగి 6 మాసాల తర్వాత మళ్లీ వడ్డీని లెక్కగడతారని వివరించారు. ఈ విధంగా మూడు సంవత్సరాలు బాకీ ఉన్న రైతుపై 6 మాసాలకు ఒకసారి 6 విడతలుగా వడ్డీని లెక్కగట్టి అసలులో జమ చేయడం వల్ల రుణ భారం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మొదట జమ చేసిన వడ్డీపై కూడా తిరిగి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదట్లో ఒకసారి రైతు అప్పు తీసుకుంటే చెల్లించే వరకు బారు వడ్డీని లెక్కగట్టి వసూలు చేసేవారని పేర్కొన్నారు. 2020 జూలై 31 వరకు రూ.11.70 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా రైతులు బాకీపడి ఉన్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 2020 నాటికి రూ.1,57,490 కోట్ల బాకీ పడి ఉండగా... తెలంగాణలో రైతులు రూ.32వేల కోట్లు బాకీ ఉన్నందున వీరంతా చక్రవడ్డీలు చెల్లించాల్సిందేనన్నారు. రుణమాఫీ పథకం ప్రకటించినప్పటి నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వకున్నా కూడా వడ్డీ భారం పెరుగుతూనే ఉందని ఆరోపించారు. 2020 వానా కాలం బ్యాంకులు రుణాలు వెల్లడించారు.
ఇదీ చదవండి: రాజకీయ జోక్యం లేకుండా అర్హులను గుర్తించండి: చాడ