మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌కు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. గత నెలలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షీ టీమ్‌కు 154 ఫిర్యాదులు అందాయి. బస్‌స్టాప్‌లో వేధింపులు, ఫోన్ కాల్స్, సామాజిక మాధ్యమాలు, కామెంట్లు తరహా ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 షీ బృందాలు పనిచేస్తున్నాయని... వివిధ ప్రాంతాల్లో 498 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
72 మొబైల్ నెంబర్ల నుంచి ఫోన్లు...
హాక్ ఐ, డయల్ 100, వాట్సాప్, ఈ- మెయిల్లో ఎక్కువగా ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఇందులో 11 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళకు గత మూడు సంవత్సరాలుగా 72 మొబైల్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్‌తో ఓ వ్యక్తి వేధిస్తుండటంతో ఆమె షీ బృందాలను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు అతను అనంతపురానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు.
అక్కడికి వెళ్లిన పోలీసులు దర్యాప్తులో అతను ఫేస్బుక్ నుంచి ఆమె నెంబర్‌ను సేకరించి అతని ఊరి వాళ్ల ఫోన్ నెంబర్లతో మహిళను వేధిస్తున్నట్లు తేలింది. అతన్ని మందలించిన పోలీసులు గ్రామ సర్పంచ్‌కు విషయం చెప్పారు. అప్పటి నుంచి ఫోన్ కాల్స్ రావడం ఆగిపోయాయి.
మరో కేసు...
మరో కేసులో కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళను ఓ బస్ డ్రైవర్ అసభ్య పదజాలంతో వేధిస్తుండగా... ఆమె షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అతని నెంబర్‌కు షీ బృందంలోని సిబ్బంది చాటింగ్ చేసి వివరాలు సేకరించి... ట్రేస్ చేసి పట్టుకున్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో సీఎం సమీక్ష