GST officials on Sushi Infra Company: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా ఉంటున్న సుశీ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ సంస్థల దస్త్రాల పరిశీలనకు వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం తనిఖీలు సందర్భంగా స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో దస్త్రాలను, వ్యాపారాలకు సంబంధించిన ఇతరత్ర ఆధారాలను సంస్థల వారీగా, పద్దుల వారీగా అధికారులు ఇప్పటికే వేరు చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అబిడ్స్‌లోని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలో అధికారుల బృందం అధ్యయనం చేయడం ప్రారంభించింది.
సుశీ ఇన్‌ఫ్రా దాని అనుబంధ కంపెనీలు వందల కోట్లు జీఎస్టీ ఎగవేతకు పాల్పడి ఉండొచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్న అధికారులు.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఇప్పటికే తనిఖీలు సందర్భంగా స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, సీపీయులను ఫోరెన్షిక్ ల్యాబ్‌కు పంపించారు. అవి రావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇంతలోపు దస్త్రాల పరిశీలన పూర్తి చేయాలని.. ఆ వివరాలను ఎప్పటికప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
జీఎస్టీ చట్టం ఏమి చెబుతోంది.. సుశీ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ సంస్థలు అనుసరిస్తున్న విధానాలు జీఎస్టీ చట్టానికి లోబడి ఉన్నాయా.. లేక ఉల్లంఘనలు జరుగుతున్నాయా అన్న కోణంలో అధికారులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. జీఎస్టీ చట్టంపై పూర్తి స్థాయిలో పట్టున్న జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు స్థాయిలో అధికారుల బృందం పర్యవేక్షణలో ఈ పని జరుగుతోంది. ఇందుకు సంబంధించి సమాచారం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఇవీ చదవండి: