GST officials on Sushi Infra Company: హైదరాబాద్ నగరంలో సుశీ ఇన్‌ఫ్రా, దాని అనుబంధ సంస్థలకు చెందిన రికార్డుల పరిశీలన ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ముగ్గురు అదనపు కమిషనర్ల నేతృత్వంలో 16 సంస్థలకు చెందిన దస్త్రాలను దాదాపు వంద మంది పరిశీలిస్తున్నారు. 20కి పైగా సంస్థలను గుర్తించినప్పటికీ... కొన్ని సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడం లేదని, మరికొన్ని చిరునామా మార్చుకుని కొనసాగిస్తుండడంతో వాటిలో తనిఖీలు నిర్వహించలేకపోయినట్లు తెలుస్తోంది. అందులో నల్గొండ పట్టణంలో సుశీ ఎలక్ట్రికల్స్ పేరున ఓ సంస్థ ఉన్నట్లు తమ వద్ద ఉన్నవివరాలతో ఆ చిరునామాకు వెళ్లగా... అధికార పార్టీకి చెందిన నాయకులు నివాసం ఉన్నట్లు తెలుసుకుని వెనక్కి వచ్చారని తెలుస్తోంది. ఇలా మరో ఒకట్రెండు చిరునామాలు... తమ వద్ద ఉన్న వివరాలకు సంబంధం లేకుండా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే అదనపు కమిషనర్లు సంయుక్తరాణి, సాయికిషోర్, సునీతల పర్యవేక్షణలో దస్త్రాల పరిశీలన కొనసాగుతున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. వాణిజ్య పన్నుల కమిషనర్ నీతు ప్రసాద్‌తో పాటు మరికొందరు అధికారులు... ఈ ప్రక్రియ సజావుగా, సక్రమంగా కొనసాగేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని కూడా వెలికి తీశారు. దానిని హార్డ్ డిస్క్‌ల్లోకి ఎక్కించి... నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ లావాదేవీల్లో తేడాలు ఉన్నాయి.. రిటర్న్‌లు వేసిన వివరాలకు... వాళ్ల వద్ద ఉన్న వివరాలకు ఏమైనా తేడా ఉందా.. తదితర వివరాలను పరిశీలన చేస్తున్నారు.
దస్త్రాలను పరిశీలిస్తున్న వంద మందికిపైగా సిబ్బంది : రాజ్ టీవీలో పెట్టిన పెట్టుబడులు, రాబడుల వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. వంద మందికి పైగా అధికారులు దస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలల్లోని సమాచారంపై అధ్యయనం చేస్తుండడమే కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుండడంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిస్తున్నారు. దస్త్రాల పరిశీలనకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్లు సమాచారం. రాజకీయాలతో ముడిపడిన అంశం కావడంతో... ఒకటికి రెండు సార్లు సరిచూసుకున్న తరువాతనే ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: