డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులైన దివంగత కల్నల్ సంతోశ్‌బాబు (Colonel Santhosh Babu) సతీమణి బికుమల్ల సంతోషి... ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, విశ్వవిద్యాలయం కార్యకలాపాలపై అవగాహన పెంచుకునేందుకు హైదరాబాద్ రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆమె... పరిపాలన భవనం కమిటీ హాల్లో వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆమెకు స్వాగతం పలికారు.

విస్తృత చర్చ...
వ్యవసాయంలో కొత్త పోకడలు, వాతావరణ మార్పులు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను వీసీ... ఆమెకు వివరించారు. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, పత్తి, కంది, వేరుశనగ వంటి ప్రధాన పంటలు సాగు చేస్తున్నామని తెలిపారు. వరి పంటలో అధికోత్పత్తి సాధించగా ప్రస్తుతం విలువ జోడింపుపై దృష్టి సారించినట్లు వివరించారు. పత్తిలో అధిక సాంద్రత కలిగిన నూతన రకాల రూపకల్పనకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని తెలిపారు.

టాప్‌లో చోటు...
విశ్వవిద్యాలయం ఏర్పాటైన అనతికాలంలోనే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోనే టాప్ 10 వ్యవసాయ వర్సిటీల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు అమలు కోసం కృత్రిమ మేధస్సు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీస్, రోబోటిక్స్‌పై అగ్రీ హబ్ ద్వారా కృషి చేస్తున్నామని వీసీ తెలిపారు. అనంతరం సంతోషి... రాజేంద్రనగర్‌లోని పలు ప్రయోగశాలలు, ఇతర పరిశోధన కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కల్నల్ సంతోష్‌బాబుకు మహావీర్ చక్ర