కొవిడ్‌తో అనాథలుగా మారిన ఏ ఒక్కరూ ఒంటరిగా మిగలకూడదనే సంకల్పంతో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. పక్కాగా వివరాలు సేకరించి పిల్లల ఆసక్తి, ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా నీడ కల్పించనుంది. హైదరాబాద్ జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ శ్వేతా మహంతి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నగరంలో తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇద్దరినీ కోల్పోయి నిస్సహాయంగా మారిన పిల్లల వివరాలు సేకరిస్తున్నారు. బాగోగులు చూసేందుకు అనువైన చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. తొలి విడతగా 10 మంది అనాథలకు, అమ్మ లేదా నాన్నను కోల్పోయిన 130 మంది చిన్నారులకు సాయం అందించారు. గురుకులాల్లో చదువుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాలుపంచుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తమ వంతు తోడ్పాటు అందిస్తామని చెబుతున్నాయని అధికారులు తెలిపారు.
సమాచారం సేకరణ..
నగర పరిధిలో ఎంతోమంది పిల్లలు కొవిడ్‌తో అనాథలుగా మారారు. కొందరు ఆత్మాభిమానంతో సాయం కోరేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరికొందరు ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఇటీవల మహిళా-శిశు సంక్షేమశాఖ అధికారులు తొలివిడతగా బంధువులు/సంరక్షకుల వద్ద ఉన్న పిల్లల సమాచారం సేకరించారు. మరింత సమాచారం కోసం అంగన్‌వాడీ టీచర్లు/సహాయకులను వినియోగించనున్నారు. పూటగడవటం కష్టంగా ఉన్నపిల్లలను గుర్తించి వెంటనే సంరక్షణ గృహాలకు చేరుస్తారు. చదువుకు ఆటంకం కలగకుండా ఉపకారవేతనం అందేలా చేస్తున్నామని జిల్లా సంక్షేమశాఖాధికారి అక్కేశ్వరరావు చెప్పారు. న్రిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న వారికీ సాయం అందిస్తున్నారు.
చదువుకు ఆటంకం లేదిక
సుమారు 200 మంది విద్యార్థులను గుర్తించి చదువుకు ఆర్థిక సాయం అందించనున్నారు. పాఠశాల ఫీజులు చెల్లించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. దాతలూ సాయం అందిస్తామంటున్నారు. వివిధ మార్గాల్లో లభించే సహాయాన్ని అర్హులకే అందించాలని అధికారులు భావిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచినట్టు సమాచారం. నిధులను దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన కొందరు నిర్వాహకులకు నోటీసులు కూడా జారీచేసినట్టు తెలిసింది.
ఇదీ చదవండి: Network Issue: అక్కడ ఫోన్ మాట్లాడాలంటే.. రోడ్డెక్కాల్సిందే!