Cockfights in AP : ఏపీ వ్యాప్తంగా కోళ్లు కత్తులు దూశాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విచ్చలవిడిగా కోడిపందేలు సాగాయి. వైసీపీ నాయకులే దగ్గరుండి పందేలను ప్రోత్సహించడం.. పోలీసుల మీదే కేకలు వేస్తూ పెత్తనం చెలాయించడంతో మిగిలినవారూ లెక్కచేయని పరిస్థితి. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదురేశ్వరం రోడ్డులో కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేయడం చర్చనీయాంశమైంది.
Kodi Pandelu in AP : అమలాపురం మండలం వన్నెచింతపూడిలో జగనన్న లేఅవుట్‌లో కోడిపందేల బరిని అధికార పక్షం నాయకులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, గోకవరంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోడిపందేలు ప్రారంభించారు. ఆయా వేదికలవద్ద రూ.లక్షల్లో పందేలు సాగాయి. తాళ్లరేవు మండలంలో జార్జిపేటలో రాష్ట్ర స్థాయి బరి ఏర్పాటు చేశారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు పందేలను వీక్షించారు. ఒక్కో పందెం రూ.6 లక్షలతో మొదలైంది. ఇక్కడ గుండాటను పోలీసులు అడ్డుకున్నా.. కోడిపందేలు ఆగలేదు.
చేతులు మారిన కోట్ల రూపాయలు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలిలో లెక్కింపు యంత్రాల ద్వారా పందేల నగదు లావాదేవీలు సాగాయి. భీమవరం మండలం డేగాపురం, ఆకివీడు మండలం దుంపగడపలో శుక్రవారం దాకా కబడ్డీ పోటీలు జరిపితే.. అదే ప్రాంగణం కోడి పందేలకు వేదికైంది. నిడమర్రు, సీసలి, డేగాపురంలో డిజిటల్ స్క్రీన్లలో పందేలు వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఒక్కో పందేనికి బరిలో 10 లక్షల రూపాయలు బయట 50 లక్షల రూపాయల దాకా బెట్టింగులు సాగాయి. ఒక్కో బరిలో రూ.కోటి వరకు చేతులు మారాయి. పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు కిక్కిరిశాయి.
కైకలూరు మండలం చటాకాయ్ గ్రామంలో కోడిపందేల బరిలో రెండు కోళ్లూ నెగ్గినట్లు ప్రకటించడంతో వివాదం తలెత్తింది. తాడేపల్లిగూడెంలో పందేల దగ్గర జరిగిన తోపులాటలో ఒకరి కాలు విరిగింది. నిడమర్రు మండలంలోని మందలపర్రులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. కాళ్ల మండలం సీసలి బరిలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు దగ్గరుండి పందేలు నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గిరిజనుల సంప్రదాయ కోడి పందేలను ప్రారంభించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో భోగి రోజు వేసిన పందేలు, జూదాలు అన్నీ కలిపి దాదాపు రూ.400 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.
25 ఎకరాల్లో బరి : కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ కోడి పందేలు యథేచ్ఛగా సాగాయి. రెండు జిల్లాల్లో 100కు పైగా బరులను ఏర్పాటు చేశారు. అధికార వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల కనుసన్నల్లో వీటిని నిర్వహిస్తున్నారు. గన్నవరంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పందేలు సాగాయి. ప్రధానంగా అంపాపురంలో 25 ఎకరాల్లో అతి పెద్ద బరి ఏర్పాటైంది. కోడి పందేలతోపాటు జూదం విచ్చలవిడిగా జరిగింది.
పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లులో వైసీపీ నేతల కనుసన్నల్లో 30 ఎకరాల్లో బరిని సిద్ధం చేశారు. ఇక్కడ జూద శిబిరాలూ వెలిశాయి. గుడివాడ నియోజకవర్గం పరిధిలో 15కుపైగా బరులున్నాయి. లింగవరం కె.కన్వెన్షన్ ప్రాంతం, బైపాస్‌రోడ్డు, పామర్రు-కత్తిపూడి జాతీయ రహదారిని ఆనుకుని మల్లాయపాలెం పంచాయతీ పరిధిలో, బందరు రోడ్డులో బొమ్ములూరు మలుపువద్ద, నందివాడ, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో శిబిరాల్ని సిద్ధం చేశారు. గుడ్లవల్లేరులోని వేమవరం బరివద్ద 3, 5 పందాలు వరుసగా గెలిస్తే బుల్లెట్, స్కూటీలను బహుమతులుగా ఇస్తున్నారు.
సీసీ కెమెరాల కనుసన్నల్లో : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లేల సమీపంలోని మామిడి తోటలో కోడి పందేల బరి ఏర్పాటు చేశారు. దీనికి పక్కనే తోటల్లో గుడారాలు పెట్టి క్యాసినో నిర్వాహకులను తీసుకొచ్చి జూద క్రీడను ఆడిస్తున్నారు. లోపలికి ఎవరూ వెళ్లకుండా గట్టి కాపలా పెట్టారు. ప్రవేశ రుసుమే 15వేల రూపాయలుగా నిర్ణయించారు. భోజనానికి మరో 2వేలు రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన నాయకుడి కనుసన్నల్లోనే ఈ క్యాసినో నిర్వహిస్తున్నారు. పర్యవేక్షణకు సీసీ కెమెరాలను అమర్చారు. బౌన్సర్లతో పాటు ప్రైవేటు సైన్యం కాపలాగా ఉంది. గురువారం రాత్రి వరకూ మల్లేలలోని హడావుడి చేసిన పోలీసులు శనివారం కనిపించలేదు.
అధికార పార్టీ నాయకుల ప్రత్యేక బరులు : బాపట్ల జిల్లాలో అధికార వైసీపీ నేతల కనుసన్నల్లో కోడి పందేలు భారీగా నిర్వహించారు. భోగి నుంచి ప్రారంభమైన పందేలు కనుమ వరకు కొనసాగనున్నాయి. మంత్రి మేరుగు నాగార్జున ఇలాకాలో నియోజకవర్గ కేంద్రం వేమూరు, భట్టిప్రోలు మండలం పల్లెకోన, కొల్లూరు మండలం ఈపూరు, చుండూరు మండలం వేటపాలెంలో స్థానిక పార్టీ నేతలు ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలతో కలిసి మంత్రి నాలుగు బరుల్ని సందర్శించి పందేలు వేయించారు.
భోగి రోజే కోట్ల రూపాయల నగదు చేతులు మారింది. వైసీపీ జిల్లా కన్వీనర్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు బాధ్యుడిగా ఉన్న రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలం పెనుమూడి, నిజాంపట్నంలలో పార్టీ నేతలు, అనుచరులు ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్, చెన్నై, నెల్లూరు, విజయవాడ నుంచి వచ్చిన పందెం రాయుళ్లు పోటాపోటీగా లక్షల రూపాయల్లో పందేలు కాశారు.
బరుల దగ్గర కోతముక్క, మూడు ముక్కలు, గుండాట నిర్వహించారు. ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి మద్యం విక్రయించారు. ఇంత జరుగుతున్నా ఆపటానికి పోలీసులు కనీస ప్రయత్నం చేయలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పందెం రాయుళ్లు బస చేయటానికి బరుల నిర్వాహకులే హోటళ్లు, లాడ్జిల్లో గదులు బుక్ చేశారు. కొన్ని ఇళ్లను అతిథి గృహాలుగా మార్చారు. రాత్రిళ్లు బరుల వద్ద విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఇబ్బంది కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేయించడం విశేషం.
కోడి పందేలు లేవు ఏమి లేవు : కోడిపందేలు, గుండాట నిర్వహణకు సిద్ధం చేస్తున్న బరుల్ని తొలగించేందుకొచ్చిన పోలీసులపై ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విరుచుకుపడ్డారు. ఇది ప్రైవేటు స్థలమని, మీరెందుకొచ్చారని, వెంటనే వెళ్లిపోవాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ‘పోలీసులెవరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఇది మా సొంత స్థలం. మీ ప్రమేయం ఏమిటి? ఇక్కడ కోడి పుంజులుగానీ, ఇతర ఆటల సామగ్రిగానీ ఏమీ లేవు. కావాలంటే మమ్మల్ని కట్టేసుకుని తీసుకుపోండి’ అంటూ పోలీసులపై రుసరుసలాడారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడులోని వెదిరేశ్వరం రోడ్డు పక్కన పందేల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను తొలగించేందుకు రావులపాలెం అదనపు ఎస్.ఐ.సురేంద్ర సిబ్బందితో రాగా జగ్గిరెడ్డి వారిపై మండిపడ్డారు.
గాలిలో ఎగిరిన అభిమానం : సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ అనుచరుల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో పలుచోట్ల భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని అంపాపురంలో ఏర్పాటు చేసిన జూద శిబిరం దగ్గర సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వాహకులు ఓ బెలూన్ ఎగరేశారు. దానిపై సీఎం జగన్, కొడాలి నాని, వల్లభనేని వంశీ చిత్రాలు ఉండటం గమనార్హం.
పందెం రాయుళ్లను, వీక్షకులను ఆకర్షించేలా కోడి పందేల నిర్వాహకులు వినూత్న ధోరణి అవలంబిస్తున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఓ బరి వద్ద లక్కీ డ్రాలో బుల్లెట్‌ను బహుమతిగా ఉంచారు. దీనికి రూ.1,000 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలోని ఓ బరి దగ్గరా ఇదే తరహాలో ద్విచక్ర వాహనాన్ని ఉంచారు.