CM Revanth Reddy Review Officials : రైతుభరోసా, పింఛన్లపై అపోహలు వద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుభరోసా, పింఛన్లు కొత్తగా కావాలనుకునే వారు మాత్రమే ప్రజాపాలన సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఇప్పటికే పింఛన్, రైతుబంధు పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై సీఎస్ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో, రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం : ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని, రెండు రోజులుగా సుమారు పదిహేనున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy), అధికారులు వివరించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అర్జీదారులు బారులు తీరారని తెలిపారు. దరఖాస్తుల కొరత, నిబంధనలపై అనుమానాలపై సమీక్షలో జరిగింది. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని అర్జీలు అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను, ఆయన ఆదేశించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం
దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు : దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని రేవంత్‌రెడ్డి అన్నారు.
Praja Palana Telangana 2023 : రైతుబంధు, పింఛన్ల పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి, అధికారులకు సూచించారు. సమీక్ష అనంతరం సీఎం రేవంత్‌రెడ్డిని, పుదుచ్చెరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం కలిశారు.
కొనసాగుతున్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - ఫామ్స్ లేక ప్రజలకు అగచాట్లు
ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ : మరోవైపు ప్రజాపాలన కార్యక్రమానికి (Praja Palana)దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండురోజుల్లో 15,59,276 దరఖాస్తులు వచ్చాయి. తొలిరోజు దరఖాస్తులు 7లక్షలకు పైగా వస్తే, రెండోరోజు తెలంగాణ వ్యాప్తంగా 8,12,862 వచ్చాయి. దరఖాస్తులు తామే ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నారు. అయినా కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు రూ.20 నుంచి రూ.100 వరకు ఫారాలను అమ్ముతున్నారు. మరోవైపు దరఖాస్తుల్లో నింపాల్సిన అంశాలు, పథకాలకు సంబంధించిన నిబంధనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా చెబుతుండడంతో మరింత గందరగోళానికి దారితీస్తోంది.
కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి సమావేశం - ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చ