CM Revanth Reddy Conducted Meeting With Collectors and Police Officers : అధికారులే తమ సాధకులని ఆరు గ్యారంటీల అమలులో క్షేత్రస్థాయిలో బాధ్యతగా, క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో సచివాలయంలోని ఏడో అంతస్తులో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యం దిశగా ప్రయాణించలేమన్నారు. సచివాలయంలో పాలసీ నిర్ణయాలనే తీసుకుంటామని వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులు, ఉద్యోగులేనని సీఎం పేర్కొన్నారు.
అంబేద్కర్(Dr BR Ambedkar) చెప్పినట్లుగా అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని చివరి వరసలో ఉన్న నిరుపేదలకు సంక్షేమం అందితేనే అభివృద్ధి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మారుమూల పల్లెలు, గూడేలా, తండాల్లో పేదలకు సంక్షేమ పథకాలు చేర్చాల్సిన వారధులు అధికారులేనని పేర్కొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న కలెక్టర్లు గ్రామసభల్లో సంక్షేమ పథకాలకు అసలైన అర్హులను గుర్తించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
CM Revanth Reddy Review with Collectors : సివిల్ సర్వీసు(Civil Services) అధికారులు శంకరన్ స్ఫూర్తిగా పనిచేయాలని సీఎం కోరారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రజలతో శభాశ్ అనిపించుకున్నంత వరకు ఫ్రెండ్లీగానే ఉంటుంది కానీ పాలన లోపాలు, నిర్లక్ష్యం కనిపిస్తే సమీక్షిస్తామని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లేందుకు, కష్టపడి పనిచేయడానికి ఇబ్బందిగా ఉన్న వారిని కలెక్టర్, ఎస్పీల వంటి స్థానాల నుంచి బదిలీ చేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Congress Six Guarantees : ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో మమేకమై బాధ్యతగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీగా వ్యవహరించి ప్రజల మనసును గెలుచుకోవాలని సీఎం చెప్పారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో చూడాలని చట్టాలు, నిబంధనలను మానవీయ కోణంలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
నాలుగు నెలలకు ఒకసారి సమీక్ష : ప్రజల నుంచి గౌరవ, మర్యాదలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎంతటివారినైనా ఇంటికి పంపించే శక్తిమంతమైన చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలన్నారు. అధికారులతో ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. అధికారులు కూడా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అధికారులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని భవిష్యత్తులో పోస్టింగులకు నిజాయతీని ప్రామాణికంగా తీసుకుంటామన్నారు.
ఎంసీఆర్హెచ్ఆర్డీలోని ఖాళీ ప్రాంగణంలో సీఎం క్యాంప్ కార్యాలయం : రేవంత్ రెడ్డి
రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వానిది : సీఎం రేవంత్ రెడ్డి