పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు.
ఈ సందర్భంగా రంజాన్ పర్వదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న సీఎం.. అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన ముస్లింల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదపడుతోందన్న సీఎం.. ముస్లిం మైనార్టీ బిడ్డల చదువుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు విజయవంతమయ్యాయన్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ నిబంధనలను అనుసరించి ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ముస్లిం సోదరులను ముఖ్యమంత్రి కోరారు.
ఇదీ చూడండి: మే తర్వాత కరోనా ఉద్ధృతి తగ్గుతుంది: పంచాంగ శ్రవణం