CM KCR on Women's Day మహిళా అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ విభిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీ శక్తిని చాటుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుందని అన్నారు.
యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః అన్న ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని... మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు... వారి గౌరవాన్ని పెంపొందిస్తూ.. స్త్రీజనోద్ధరణే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతోందని కేసీఆర్ అన్నారు.
ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటోందని వివరించారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,90,639 మంది లబ్దిదారుల కోసం రూ.1261 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చెప్పారు.
ఆరోగ్యలక్ష్మీ పథకం ద్వారా 1,73,85,797 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందినట్లు తెలిపారు. ఆసరా పథకం కింద ఒంటరి మహిళలకు రూ.1,430 కోట్లు, వితంతువులకు రూ.19,000కోట్లు, మహిళా బీడీ కార్మికులకు రూ.5,393 కోట్లు ఫించనుగా పొందినట్లు పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,03,818 మంది లబ్దిదారులకు రూ.11,775 కోట్లు అందించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇప్పటి వరకు 5,75,43,664 బతుకమ్మ చీరల పంపిణీ కోసం రూ.1,536 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు భారీగా పెంచామన్న సీఎం... వీహబ్ ద్వారా చేపట్టిన 21 కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల నేతృత్వంలోని అంకురాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కుల నిర్వహణ ద్వారా 1500 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన, మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్‌లో 10 శాతం ప్లాట్లు రిజర్వు చేసినట్లు తెలిపారు.
స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు... సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఏఆర్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.750 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్లు చెప్పారు. అభయహస్తం పథకం కింద రూ.546 కోట్ల విలువైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసి మహిళా వికాసం పట్ల తన చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చాటుకుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఇవీ చూడండి: