CM KCR Jagtial Tour Today : ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలతో జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. పార్టీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న టీఆర్ఎస్... అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రారంభం కాగా.. ఇవాళ జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ప్రభుత్వం నిర్మించనున్న కొత్త వైద్య కళాశాలకు సంబంధించి సీఎం ఇవాళ భూమిపూజ చేయనున్నారు.
CM KCR Jagtial Tour updates : ప్రభుత్వం 510 కోట్లతో 27 ఎకరాలలో మెడికల్ కళాశాల నిర్మించనుంది. టీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ జగిత్యాలలో ప్రారంభించనున్నారు. 20 ఎకరాల్లో 49 కోట్లకుపైగా వ్యయంతో.. ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా అన్ని హంగులతో భవనాన్ని నిర్మించారు. కార్యాలయ సముదాయంలో 32 శాఖలకు గదులు నిర్మించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ పర్యవేక్షించారు.
సీఎం పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన రహదారులు ఫ్లెక్లీలతో నిండిపోయాయి. ముఖ్యమంత్రి వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం.. ప్రజలను ఉద్దేశించి బహిరంగసభలో మాట్లాడనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా బహిరంగ సభలో పాల్గొననున్నారు.
భారీ జనసమీకరణలో టీఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమయ్యాయి. 30 ఎకరాల్లో నిర్వహించే భారీసభకు 2 లక్షల మందికిపైగా తరలించేలా ప్రణాళిక రూపొందించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగిత్యాలకు చేరుకుంటారు. వివిధ కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు.
ఇవీ చదవండి: