CM KCR Tour:ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకుంటారు. మంగళవారం రోజు సీఎం కేసీఆర్.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో భేటీ అవుతారని తెలిసింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్... తమిళనాడు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తిరుచిరాపల్లి వెళతారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి మధ్యాహ్నం తర్వాత రంగనాథస్వామిని దర్శించుకుని, విమానాశ్రయానికి తిరుగుప్రయాణమవుతారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం స్టాలిన్‌తో సమావేశమవుతారని సమాచారం.
స్టాలిన్‌తో భేటీ..!
కేంద్ర ప్రభుత్వం యాసంగిలో దొడ్డు బియ్యం సేకరించేది లేదని ప్రకటించడం, వానాకాలంలోనూ లక్ష్యాన్ని స్పష్టంగా వెల్లడించకపోవడం తదితర అంశాలను నిరసిస్తూ తెరాస ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో నిరసనలు తెలిపి... తర్వాత సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ ధోరణిని ఎండగట్టడంతోపాటు పంటలకు మద్దతు ధరలపై విధాన నిర్ణయాన్ని వెల్లడించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీల మద్దతు సమీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన స్టాలిన్‌తో చెన్నైలో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భాజపా వ్యతిరేక కూటమి పైనా చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే మార్చి 28న జరగనున్న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ఆహ్వానిస్తారు. గత లోక్‌సభ ఎన్నిక ముందు 2010 మే నెల 13న కేసీఆర్ శ్రీరంగం వెళ్లి ఆ తర్వాత అప్పటి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.
ఇదీ చదవండి: రూ.270తో లాటరీ టికెట్ కొన్న డ్రైవర్- మధ్యాహ్నానికి రూ.కోటి జాక్‌పాట్