CM KCR on Early paddy cultivation : రాష్ట్ర సాగు రంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో వ్యవసాయ రంగ పునరుజ్జీవనమే ప్రథమ ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ వ్యవస్థలైన చెరువులు, విద్యుత్, సాగునీరు తదితర రంగాలను బలోపేతం చేసుకున్నామని..వాటి ఫలితమే దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర అభివృద్ధి అని సీఎం పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వానలు తద్వారా జరిగిన పంట నష్టం, రైతుకు కలిగిన కష్టాలను గుణపాఠంగా తీసుకుని అందుకు అనుగుణంగా పంట విధానాలను మార్చుకోవాల్సిన అవసరముందని కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు.
CM KCR on Early cultivation : ప్రాజెక్టులతో సమృద్ధిగా సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు వల్ల మొగులు ముఖం చూడాల్సిన అవసరం లేకుండానే..కాల్వ నీళ్లతో వరినాట్లు వేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి ప్రస్తుతం 3 కోట్ల మెట్రిక్ టన్నులను దాటిపోతున్నందున అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతూ, రైతులను సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ వరినాట్లు ముందుగా వేసుకోవాల్సిన అవశ్యకతను తెలియజేశారు.
వానాకాలం నారు రోహిణీ కార్తెలో.. యాసంగి నారు అనురాధ కార్తెలో ఉండేలా చూసుకోవాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. యాసంగి నాట్లు ఆలస్యం కావడం వల్ల మార్చి 31 లోపే జరగాల్సిన కోతలు మే దాటినా కొనసాగుతున్నయని, దాంతో ఎండాకాలంలో వచ్చే అకాల వర్షాల బారిన పడి పంటలు నష్టపోతున్నారని అన్నారు. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 15 నుంచి 20 లోపు యాసంగి వరినాట్లు వేసుకోవాలని రైతులకు సీఎం సూచించారు.
యాసంగిలో వరినారు నవంబర్‌లో అలికితే చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో ఉందని, అది వాస్తవం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. వరి తూకం పోసేటప్పుడు కాదు. వరి ఈనే సమయంలో చలి ఉండొద్దని తెలిపారు. ఎండలు ముదరకముందే వరికోసుకుంటే గింజ గట్టిగా ఉండి తూకం బాగుంటుందని చెప్పారు. వానాకాలం నారు రోహిణీ కార్తెలో యాసంగి నారు అనురాధ కార్తెలో వేసుకోవాలని రైతులకు సూచించారు.
వ్యవసాయ శాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరిచాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వ్యసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల టన్నుల ఎరువుల వినియోగం నుంచి ప్రస్తుతం 28 లక్షల టన్నులకు పెరిగిందని అన్నారు. గంజి కేంద్రాలు నడిచిన పాలమూరు నేడు పచ్చటి పంటలతో అలరారుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి: