ప్రయాణికుల రవాణా అవసరాలను గుర్తించి.. ఆ మేరకు సేవలందించాలని ఆర్టీసీ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రయాణికులు చెయ్యెత్తిన చోట ఆపడం, అడిగిన చోట దింపడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 1వ తేదీన ఆత్మీయ సమావేశంలో సూచించిన విధానపరమైన నిర్ణయాల కార్యాచరణ అమలు తీరుతెన్నులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
క్షేత్ర స్థాయిలో డిపోలకు వెళ్లి అక్కడి ఉద్యోగులకు సంస్థపై మరింత నమ్మకం కలిగించేలా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా ఓఆర్(ఆక్యుపెన్సీ రేషియో)ను 80 శాతానికి పైగా పెంచేందుకు తగిన కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఉద్యోగులకు గుర్తు చేయాలన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమం కోసం తక్షణమే డిపోల్లో సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున కార్గో నిర్వహించడానికి త్వరితగతిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈడీలను ఆదేశించారు. సంస్థలో అదనపు ఖర్చుల్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు.
ఇవీ చూడండి: ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం