రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. అదనపు కలెక్టర్లు, డీపీవోలతో 5 గంటలకుపైగా సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్లు, అధికారులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని.... పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పారు.
అధికారులు కంకణబద్దులై గ్రామాలు, పట్ణణాల అభివృద్ధిని యజ్ఞంలా భావించి కృషి చేయాలని కోరారు. హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని సూచించారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో మెక్కలు నాటడం, తదితర కార్యక్రమాల పురోగతిని తన తనిఖీలో భాగంగా పర్యవేక్షిస్తానని స్పష్టంచేశారు. అధికారులు పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా అదనపు కలెక్టర్లు, డీపీఓల పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తేల్చిచెప్పారు. ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదన్నారు.
జూన్ 20న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తామని సీఎం ప్రకటించారు. జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీ ఉంటుందన్నారు. వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల సమస్యల తక్షణ పరిష్కారం కోసం అదనపు కలెక్టర్లకు 25 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇదీ చదవండి: 'సీఎం కేసీఆర్‌కు, ఈటల రాజేందర్‌కు మధ్య ఏం జరిగిందో !'