రాష్ట్రంలో కొత్తగా 37 వేల మంచినీటి ట్యాంకులు నిర్మించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో కూడా ఇంటింటికి నల్లా ద్వారా నీరు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మిషన్ భగీరథలో ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇంటింటికి నల్లానీరు వందశాతం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణేనని.. కేంద్ర జల్‌శక్తి శాఖ చెప్పిందని ఆయన వెల్లడించారు. సాగునీటి కోసం మా భూమిలో కూడా 37 బోర్లు వేశామని... ఇప్పుడు బోర్లు వేయాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. భూగర్భ జలాలు అత్యధికంగా పెరిగిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్రమే చెప్పిందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ... విజయవంతమైన పథకాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నాం..
ఒకప్పుడు వెయ్యి అడుగులు వేసినా... నీరు రాని పరిస్థితి ఉండేది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ... విజయవంతమైన పథకాలు. ఎండాకాలంలో కూడా చెరువులు నింపి, కాలువల ద్వారా నీళ్లు ఇస్తున్నాం. ప్రాజెక్టుల పునరాకృతి వల్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని 230 టీఎంసీలకు పెంచాం. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసింది తెరాస ప్రభుత్వమే. పాలమూరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 91.2 టీఎంసీలకు పెంచాం. సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.800 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం రూ.8 వేల కోట్లు కేటాయించింది. - సీఎం కేసీఆర్.
బాధితులకు న్యాయం చేస్తాం
మల్లన్నసాగర్ ఆయకట్టు బాధితులకు న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 7 వేల ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అద్భుతమైన కాలనీ నిర్మించి ఇస్తున్నామని వెల్లడించారు. ఎస్సారెస్పీ తర్వాత భారీ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు మల్లన్నసాగరేనని సీఎం తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కొన్ని ప్రాంతాలు మునిగాయన్నారు. చాలామంది మల్లన్నసాగర్ వెళ్లి నానాయాగీ చేశారని... ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 371 కేసులు కూడా వేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతోందని... జూన్ నాటికి మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. నిర్వాసితులకు పూర్తి సంతృప్తికరమైన పరిహార ప్యాకేజీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్ జోక్యం!