CM KCR Speech in Adivasi and Banjara Atmiya sabha: గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో మేథోమధనం జరగాలని సూచించారు. భారతజాతి ప్రతినిధులుగా గిరిజన బిడ్డలు ఎదగాలని ఆకాంక్షించిన సీఎం.. గిరిజనుల జీవనశైలి, సంప్రదాయాలను కాపాడుతున్నామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో కేసీఆర్ మాట్లాడారు.
ఈ క్రమంలోనే గతంలో గిరిజనులకు 5-6 శాతం రిజర్వేషన్లు ఉండేవని గుర్తు చేసిన సీఎం.. రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపాలని ప్రధానిని కోరుతున్నానన్న కేసీఆర్.. తమకు రావాల్సిన న్యాయమైన హక్కునే కోరుతున్నామన్నారు. మోదీ.. ఆ జీవో అమలు చేస్తారా? దాన్నే ఉరితాడు చేసుకుంటారా అన్న సీఎం.. వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తామన్నారు. 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామన్న కేసీఆర్.. తన చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభిస్తానన్నారు. త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామని తెలిపారు. భూములను గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేశామని... నివేదికలు అందిన తర్వాత రైతుబంధు కూడా ఇస్తామని చెప్పారు.
వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తాం. మోదీ.. ఆ జీవో అమలు చేస్తారా..? దాన్నే ఉరితాడు చేసుకుంటారా..? కేంద్రానికి మొర పెట్టుకుని విసిగి వేసారిపోయాం. 10 శాతం రిజర్వేషన్లు రాష్ట్రమే అమలు చేసుకుంటుంది. గిరిజన బంధు అమలు చేస్తాం. నా చేతుల మీదుగా గిరిజన బంధు పథకం ప్రారంభిస్తా. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతాం.- సీఎం కేసీఆర్
ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మనకు రావాల్సిన న్యాయమైన హక్కులనూ ఇవ్వట్లేదని ఆరోపించారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణ.. మరో కల్లోలానికి గురికావద్దని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సమాజం అంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గిరిజన గురుకులాలను మరిన్ని పెంచుతామని తెలిపిన సీఎం.. ఈ ఏడాదే గిరిజన బాలికలకు గురుకులాలు తెచ్చే యోచన ఉందన్నారు. అంతకుముందు నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు కళారూపాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుస్సాడీ, గోండు, లంబాడీ సహా 33 రకాల కళారూపాలను ప్రదర్శిస్తూ పెద్దఎత్తున బహిరంగ సభకు తరలివచ్చారు.
ఆ భవనాలను జాతికి అంకితం చేసిన సీఎం..: అంతకుముందు సీఎం కేసీఆర్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించారు. సంత్ సేవాలాల్, కుమురంభీం భవనాలను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి గిరిజన, ఆదివాసీ బిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు భవనాలను కలియ తిరిగిన ముఖ్యమంత్రి.. కమ్యూనిటీ హాళ్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలు ఈ భవనాల వేదికగా మరింత ప్రగతిబాటలో నడవాలని సీఎం ఆకాంక్షించారు.
ఇవీ చూడండి..
KCR inaugurates Banjara Bhavans : 'బంజారాహిల్స్‌లో బంజారాలకే చోటు లేకుండా పోయింది'
ఘనంగా శునకం బర్త్‌డే సెలబ్రేషన్స్.. కేక్ కటింగ్.. అందరికీ స్పెషల్ డిన్నర్!