ఎస్సీ మహిళ మరియమ్మ (Mariyamma) లాకప్‌డెత్‌కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... డీజీపీ మహేందర్ రెడ్డి (Dgp Mahender Reddy)ని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం స్పష్టం చేశారు.
అత్యంత బాధాకరం...
మరియమ్మ లాకప్‌డెత్ అత్యంత బాధాకరమని... ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి అన్నారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ. 15 లక్షల పరిహారం, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షలు ఆర్థిక సాయంగా అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ (Cs Somesh Kumar)ను ఆదేశించారు.
భట్టితో కలిసి వెళ్లండి...
ఖమ్మం జిల్లా చింతకానికి వెళ్లి లాకప్‌డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలో పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్... ఈనెల 28న స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్షనేత (భట్టి విక్రమార్క Bhatti Vikramarka)తో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సూచించారు.
మారాలి...
దళితుల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి... ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితులు, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, వాటిని క్షమించబోమని సీఎం స్పష్టం చేశారు.
ఊరుకోం...
దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని, తక్షణమే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. లాకప్‌డెత్‌కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి... చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదన్న కేసీఆర్... అవసరమైతే ఉద్యోగం తొలగించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: Suspend: మహిళ లాకప్ డెత్ కేసు.. ముగ్గురిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ