CM KCR Comments in BRS Meeting : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని దశాబ్దంలో శతాబ్ది అభివృద్ధి చేశామన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి వేడుకలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. సర్వేలన్నీ సానుకూలంగా ఉన్నాయన్న ఆయన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులం, మతంపై ఏ పార్టీ గెలవదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలను సమాన దృష్టితో చూడడమే బీఆర్ఎస్ విజయ రహస్యమని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ శాతం మళ్లీ సీట్లు వస్తాయని వివరించారు.
గుజరాత్ మోడల్ బోగస్.. దేశం తెలంగాణ మోడల్ కోరుకుంటోంది : తాను చెప్పినట్టు చేస్తే 50 వేల మెజారిటీ గ్యారంటీ అని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ మోడలే శరణ్యమని ఔరంగాబాద్‌లో ఒక ఐఏఎస్ చెప్పారన్నారు. మనం చేసిన పనులను మనమే చెప్పుకోవట్లేదని పార్టీ శ్రేణులకు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వామ్యం కావాలని సూచించారు. అంశాల వారీగా రాజకీయాలు చేయాలని చెప్పారు. తెలంగాణ వజ్రపు తునక.. ఇవాళ ఏపీ పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు. సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటామంటే.. మోదీ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. గుజరాత్ మోడల్ బోగస్.. దేశం తెలంగాణ మోడల్ కోరుకుంటోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు బాసులు, భగవద్గీత, వేదాలన్నీ తెలంగాణ ప్రజలేనని చెప్పారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తోంది : కల్తీ విత్తనాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రజలకు తెలపాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు. పారదర్శక, అవినీతిరహిత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు 3 వారాల పాటు దద్దరిల్లేలా చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరును క్షుణ్ణంగా గమనిస్తున్నానని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు పార్టీ నేతలందరినీ కలుపుకుని పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అనుమానం అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. విత్తనాల కల్తీలకు పాల్పడితే పీడీ చట్టం పెడుతున్నామని హెచ్చరికలు పంపారు. రైతులను మోసం చేసినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సమక్షంలో చేరిన మహారాష్ట్ర నేతలు : కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో మహారాష్ట్ర నేతలు చేరారు. బీఆర్ఎస్లో అమరావతి మాజీ ఎంపీ అనంత్‌రావు గూడే, కున్బిసేన అధ్యక్షుడు సురేశ్ వర్షే, మహిళా ఉద్యమకారిణి మృదులా పాటిల్, విద్యావేత్త మంజర్ ఖేడే పలువురికి ఆ పార్టీ అధ్యక్షుడు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఇవీ చదవండి: