యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులతో సమావేశమైన సీఎం.. పంటల సాగు విషయమై చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు నిర్ణీత పంటల సాగు కోసం క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించారు. అధికారుల ప్రతిపాదనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి ఏ పంట ఎంత మేరకు సాగు చేయాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ యాసంగి సీజన్‌లో యాభై లక్షల ఎకరాల్లో వరిపంటను సాగు చేయాలని, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. శనగపంటను నాలుగున్నర లక్షల ఎకరాల్లో, వేరు శనగను నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని.. మిరపతో పాటు ఇతర కూరగాయలను లక్షన్నర నుంచి రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలిపారు.
జొన్న, నువ్వులను లక్ష ఎకరాల చొప్పున.. పెసర్లు 50 నుంచి 60 వేల ఎకరాల్లో, మినుములు 50 వేల ఎకరాల్లో, పొద్దు తిరుగుడు 30 నుంచి 40 వేల ఎకరాల్లో సాగు చేయాలని చెప్పారు. ఆవాలు, కుసుమలు, సజ్జలు లాంటి ఇతర పంటలను మిగిలిన 60 నుంచి 70 వేల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు.
మొక్కజొన్న వద్దు..
మొక్కజొన్న ధర, మార్కెట్ విషయంలో అనిశ్చితి నెలకొన్నందున ఆ పంటసాగు చేయకపోవడమే శ్రేయస్కరమని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు. మొక్కజొన్న సాగు వద్దని ప్రభుత్వపరంగా రైతులకు సూచించడమే మేలన్నారు. మొక్కజొన్నకు రూ. 900కు మించి ధర వచ్చే అవకాశం లేదని అధికారులు అంచనా వేశారు. మంచిధర వచ్చే అవకాశం లేనందున మొక్కజొన్న సాగు విషయమై రైతులే నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. మొక్కజొన్న సాగు వద్దనేది ప్రభుత్వ సూచన అన్న సీఎం... అయినప్పటికీ ఎవరైనా సాగు చేయాలని భావిస్తే అది వారిష్టమన్నారు.
జిల్లాలు, మండలాలు, క్లస్టర్ల వారీగా ఏ పంటలు వేయాలన్న విషయమై వ్యవసాయ అధికారులు రైతులకు స్థానికంగా సూచించాలని సీఎం కోరారు. క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా పంట సాగు లెక్కలతో కార్డులను తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దసరా నాటికి చాలా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తవుతుందన్న సీఎం... వాటి ద్వారా రైతులను సంఘటితం చేయడం, సమన్వయపరచడం సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రూ. 5వేల కోట్ల నష్టం అంచనా