CM KCR REVIEW: భారీ వర్షాల వల్ల ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో వరదలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. వాతావరణశాఖ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనలు చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను తెలుసుకున్నారు. గోదావరి ఉద్ధృతిపై ఆరా తీసిన సీఎం.. నీటిపారుదల శాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు తీసుకుంటున్న జాగ్రత్తలను తెలుసుకున్నారు.
వర్షాల నేపథ్యంలో పరిస్థితులు చక్కబడేవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లాలు, నియోజకవర్గాలు విడిచి వెళ్లరాదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వాగులు, వంకలు, జలాశయాలు, నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైనంతమేర తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. నగరంలోని జెన్‌కో కార్యాలయంలో అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు ట్రాన్స్ కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు,నిరంతరం విద్యుత్ సరఫరా, కంట్రోల్ సెంటర్‌ల ఏర్పాటు సహా క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన వంటి అంశాలపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డితో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా... క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలం వద్ద వరద పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ముంపు ప్రాంతమైన సుభాష్‌నగర్ కాలనీలోపరిశీలించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పువ్వాడ వెల్లడించారు. జిల్లాల్లో వరదల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న మంత్రులు...తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలిస్తున్నారు.
నీటిపారుదలశాఖ అప్రమత్తం: గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ జలాశయాలకు సంబంధించిన ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి ఆరా తీస్తూ నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర ఎగువన గోదావరి నుంచి వరదను అంచనా వేసి చేపట్టాల్సిన చర్యలకు సీఎం ఫోన్లో అదేశాలిస్తున్నారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న రక్షణ చర్యలను ఆరా తీస్తున్నారు. వరద ముంపు అధికంగా ఉన్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన ఆదేశాలు జారీచేశారు.
కడెం ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత వరకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నా ఇంకా వరద పెరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కడెం ప్రాజెక్టు కింద 12 గ్రామాలు ఖాళీ చేయించినట్లు తెలిపారు. స్థానికంగా ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్... తగు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, ముంపునకు గురవుతున్న ఇతర పట్టణాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఎక్కడ కూడా ప్రాణహాని జరగకుండా తీసుకోవాల్సిన సత్వర చర్యలపై సీఎస్, నీటిపారుదలశాఖ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం ఆదేశాలిచ్చారు. భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఆదేశించారు.
ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పంటల పరిస్థితి, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితిపై వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కేసీఆర్ సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వచేసుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు సూచించారు. ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను బట్టి అవకాశం ఉన్న చోట జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని చెప్పారు. ఇప్పటి వరకు 2300 వరకు విద్యుత్తు స్తంభాలు కూలిపోతే 1600 వరకు పునరుద్దరించినట్లు తెలిపిన అధికారులు.. మిగతా పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. విద్యుత్తుకు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాల ద్వారా పునరుద్దరిస్తున్నట్టు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి వరదనీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్‌ను ఆదేశించారు. వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలకు స్పష్టం చేశారు. వానలు, వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు వెళ్లవద్దని సీఎం కేసీఆర్ విజ్జప్తి చేశారు.
ఇవీ చదవండి: తెలంగాణలో మరో 3 రోజులు విద్యాసంస్థలు బంద్