సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున... సాగునీటి వ్యవస్థలను పటిష్టపరచుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల అనుసంధానం, నిర్మాణాల విస్తరణ మీద మూడో రోజు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని సాధించుకుందామని సీఎం అన్నారు. దీని కోసం తాను కర్ణాటకకు వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చించి వస్తానని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ఇప్పుడు సాగునీటి వ్యవస్థ విస్తరించిందని... ఊరూరా సాగునీరు చేరుతోందని తెలిపారు. ఎస్సారెస్పీని అభివృద్ధి చేసి, మొత్తం 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నట్లు వెల్లడించారు.
వరి పంటలో దేశంలోనే అగ్రస్థానం
కాళేశ్వరం పూర్తిస్థాయిలో పని చేస్తోందన్న ముఖ్యమంత్రి... త్వరలో పాలమూరు, కల్వకుర్తి, జూరాల ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ యాసంగిలో రాష్ట్రంలో 52 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయన్నారు. వరి పంటలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మరింత క్రియాశీలకం కావాలని సూచించారు. దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి, అవసరమైన మేరకు అధికారులను నియమిస్తామని సీఎం చెప్పారు.
సాగునీరందించే అంశంపై దిశానిర్దేశం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కల్వకుర్తి, జూరాలకు అనుసంధానం చేసే కార్యాచరణకు సంబంధించి ఈ సందర్భంగా సీఎం చర్చించారు. దీని ద్వారా పాలమూరు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలు పారే విధంగా కాల్వల ఎత్తును నిర్ధారించుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: నేటితో ముగియనున్న శాఖల వారీగా పద్దులపై చర్చ