మొక్కజొన్న సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెద్ద ఎత్తున తగ్గింపు పేదరైతు పాలిట శాపంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంటల సాగు, మార్కెటింగ్ అంశాలపై మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సంబంధిత శాఖల అధికారులతో సీఎం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు.
కోటి మెట్రిక్ టన్నులకుపైగా నిల్వలు..
అంతర్జాతీయ మార్కెట్లో అవసరాలకు పోను 28 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలున్నాయని అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 2.42 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు మాత్రమే అవసరమన్నారు. అయితే 3.53 కోట్ల మెట్రిక్ టన్నుల లభ్యత ఉందని, కోటి మెట్రిక్ టన్నులకు పైగా నిల్వలు అదనంగా ఉన్నాయని వివరించారు. వానాకాలంలో దేశవ్యాప్తంగా మరో 2.04 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న దాదాపు 4.10 కోట్ల మెట్రిక్ టన్నుల పంట త్వరలోనే మార్కెట్లోకి విడుదలవుతుందని.. తద్వారా వచ్చే సంవత్సరానికి కూడా సరిపడా లభ్యత ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు.
దిగుమతి పరిస్థితులను దిగజార్చింది..
ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి అదనంగా మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించడం వల్ల పరిస్థితులను మరింత దిగజార్చిందని తెలిపారు. మొక్కజొన్న మీద విధించే 50 శాతం దిగుమతి పన్నును కేవలం 15 శాతం పన్నుకు తగ్గించిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించక రైతు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర మొక్కజొన్న రైతులకు సరైన ధర ఇప్పించాలన్న ఉద్దేశంతో కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో చర్చలు జరిపినట్లు సీఎంకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.
మొక్కజొన్న సాగుచేస్తే నష్టమే..
బిహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కోళ్ల దాణా అతి తక్కువ రేటుకే దొరుకుతున్నందున మొక్కజొన్నలు కొనేందుకు కోళ్ల వ్యాపారులు సుముఖంగా లేరని మంత్రి తెలిపారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగుచేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అధికారులు అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర లభించడం అసాధ్యమేనని సమావేశం అభిప్రాయపడింది. మొక్కజొన్న రైతు కనీస మద్దతు ధరను ఆశించే పరిస్థితి లేనేలేదని, ధర ఎంత తక్కువ వచ్చినా ఫర్వాలేదనుకునే రైతులు మాత్రమే మొక్కజొన్న సాగుకు సిద్ధపడే పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఏంచేయాలంటే..?