ఆర్టీసీ సమ్మె, ఇవాళ్టి హైకోర్టు విచారణ దృష్ట్యా సీఎం కేసీఆర్... సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులు, అడ్వొకేట్ జనరల్‌తో ప్రగతి భవన్లో సమావేశమైన సీఎం... తొమ్మిది గంటల పాటు చర్చించారు. విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు నిన్న రాత్రితో ముగిసిపోగా... తదుపరి కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు.
ప్రైవేటుపరం సంగతి ఏంచేద్దాం...?
ఇప్పటికే 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్... పలు కీలక అంశాలను చర్చలో ఉంచారు. కార్మికులు విధుల్లో చేరుకపోతే మిగతా మార్గాలను కూడా ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించగా... ఈ అంశాన్ని సమీక్షించారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, సంబంధిత అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై...
హైకోర్టులో విచారణ ఉన్న దృష్ట్యా... నివేదికలపై అధికారులతో సమాలోచనలు చేశారు. న్యాయస్థానానికి ఉన్నతాధికారులు ఇప్పటికే అఫిడవిట్లు దాఖలు చేశారు. రేపటి విచారణకు సీఎస్ సహా ఆర్టీసీ ఎండీ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరు కావాల్సి ఉంది. ధర్మాసనం ముందుంచాల్సిన అంశాలు, ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉంది?