దిల్లీ పర్యటనలో భాగంగా... ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు... కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ పనులకు అనుమతివ్వాలని కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులలో.. ఒకదానికి జాతీయహోదా ఇవ్వాలని కోరారు. కొవిడ్ నేపథ్యంలో తెలంగాణకు రాబడి తగ్గిపోయినందున.. ఆర్థికలోటు భర్తీకి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూనే..15వ ఆర్థికసంఘం, స్వచ్ఛభారత్ మిషన్, అమృత్ పథకాలతోపాటు వివిధ శాఖల నుంచి రావాల్సిన బకాయిలను...విడుదల చేయాలని కోరినట్లు తెలిసింది. దాదాపు 45 నిమిషాలుప్రధానితో కేసీఆర్ ఏకాంతగా చర్చలు జరిపారు.
గతంలో రాసిన లేఖ
ఎఫ్ఆర్బీఎమ్ పెంచితే రాష్ట్రాలకు ఉపశమనం కలుగుతుందని, ఈ విషయంపై దృష్టిసారించాలని కోరారు. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు....పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగిందని.. ఇందుకు పరిహారంగా 13 వందల కోట్లు విడుల చేయాలని.. గతంలో రాసిన లేఖని మోదీకి గుర్తు చేసిన కేసీఆర్.. వెంటనే నిధులు విడుదల చేయాలని విన్నవించారు. రక్షణ, వైమానిక ఉత్పత్తుల తయారీ కారిడార్‌ను.. తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు.
రైతుల్లో కొంత మేర
రాజకీయ అంశాలపై, రైతుల ఆందోళనపైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. జమిలి ఎన్నికలపైనా తమ అభిప్రాయాన్ని కేసీఆర్.. ప్రధానితో పంచుకున్నట్లు సమాచారం. రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల నిర్వహణతో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోందని, దీనిపై స్పష్టమైన విధానం ఉండాలని అభిప్రాయపడినట్లు సమాచారం. నూతన వ్యవసాయ చట్టాలపై కొన్ని నిబంధనలపై రైతుల్లో కొంత మేర అంసతృప్తి ఉన్న విషయాన్ని.. మోదీ దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
19 వేల 25 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే రాత పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని గత నెలలో ప్రధానికి సీఎం లేఖ రాశారు. ఈ అంశంపైనా ఇరువురు మధ్య.. చర్చ జరగినట్లు తెలిసింది. నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసిన మోదీకి... శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. తెలంగాణలో నిర్మిస్తున్న నూతన సచివాలయం నిర్మాణ పనుల గురించి వివరించినట్లు సమాచారం. తెలంగాణ హైకోర్టులో.. న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఆదిలాబాద్‌లో సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణ,ఐఐఎమ్, ఎన్ఐడీ, ఐఐఎస్ఆర్, ఐఐఎస్ఈఆర్ గురించి చర్చించినట్లు తెలిసింది. నీతి అయోగ్ సిఫార్సులకు అనుగుణంగా.. మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు 19 వేల 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని.. విన్నవించినట్లు తెలిసింది.
మోదీకి కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న.. ఔషధనగరి శంకుస్థాపనకు రావాలంటూ మోదీని, కేసీఆర్ ఆహ్వానించారు. 19 వేల ఎకరాల్లో 64 వేల కోట్ల రూపాయలతో.. 5 లక్షల 60 వేల మందికి ఉపాధి లక్ష్యంతో నిర్మిస్తున్న ఔషధనగరి.. దేశానికే తలమానికగా నిలుస్తుందని చెప్పారు. ఇందులో కేంద్ర భాగస్వామ్యం అవసరమని, సహకరించాలని మోదీని కోరినట్లు సమాచారం. ఇదే సందర్భంలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు... భారతరత్న ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. పార్లమెంటులోనూ.. పీవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించారు.
విమానాశ్రయాల ఏర్పాటుకు
అంతకుముందు.. కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలిసిన కేసీఆర్.. తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే విమానాశ్రయం ఉందని... నూతన విమానాశ్రయాల ఏర్పాటుతో జిల్లాలకు రాజధానితో.. అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. కొన్ని చోట్ల ఇప్పటికే పాత విమానాశ్రయాలు ఉన్నాయని.. సౌకర్యాలు కల్పిస్తే తిరిగి వినియోగించే వీలుందని తెలిపారు. విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన.. మౌలిక సదుపాయల కోసం నిధులు వెచ్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని కేంద్రమంత్రికి.. సీఎం కేసీఆర్ వివరించారు.
ఇదీ చూడండి : ట్రాఫిక్ ఎస్సై జీపును అపహరించిన దుండగుడు