CM KCR Review on Farmer Loan Waiver : తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రుణమాఫీ ప్రక్రియను పునఃప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో పాటు ఇతర అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రైతుబంధు తరహాలో విడతలవారీగా రుణమాఫీ : 2018 ఎన్నికల సందర్భంగా రూ.లక్ష లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, కొంతమేర రుణాలు మాఫీ చేశామని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా రుణమాఫీ చేయాలని, సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. కరోనా లాంటి ఉపద్రవంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఆర్థిక వెసులుబాటు లేక రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. ఆర్థిక పరిస్థితి కుదుట పడినందున రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. మరో రూ.19వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా... అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, విద్యుత్ సరఫరా, సాగు నీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిరాఘటంగా కొనసాగిస్తూనే ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం కక్షపూరిత వైఖరితో రుణమాఫీ అమలులో జాప్యం : తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు... తదితర కారణాల వల్ల ఆర్థిక లోటుతో ఇన్నాళ్లూ కొంత ఆలస్యమైందని కేసీఆర్ తెలిపారు. తిరిగి తెలంగాణ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో... రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చించారు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. తద్వారా రైతు సాధికారత సాధించేందుకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదన్నారు
ప్రతిపక్షాల మాటలను రైతులు విశ్వసించలేదు : రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినా తమకు ఇన్ని చేసిన సీఎం కేసీఆరే రుణమాఫీ చేస్తారని.. వారి మాటలను విశ్వసించలేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రేపటి నుంచి రుణమాఫీ ప్రక్రియ పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. రైతుల రుణమాఫీకి ఆదేశాలిచ్చిన సీఎం కేసీఆర్ రైతుబిడ్డగా.. రైతుల మంత్రిగా.. రైతుల పక్షాన ఓ ప్రకటనలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రుణమాఫీ ఆలస్యమైందన్నారు. కరోనా మూలంగా లక్ష కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రం నష్టపోయిందని చెప్పారు.
ఇవీ చదవండి :
- LB Nagar to Nagole metro : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఎల్బీనగర్ - నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభం..
- Interview With TSRTC Chairman : టీఎస్ఆర్టీసీ ఉద్యోగికి ఎంత వేతనం పెరగనుంది?.. ఎప్పటి నుంచి?
- Liquor Shops Tender Notification 2023 : మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి ప్రభుత్వం ఉత్తర్వులు.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే.?