ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను వంద శాతం స్థానిక గిరిజనులకే రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవోను కొట్టివేస్తూ... సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు.
సుప్రీంకోర్టు తీర్పు స్థానిక గిరిజనులకు చాలా అన్యాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరుఫున న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజ్యంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు భంగకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయ పోరాటం చేయాలని అభ్యర్థించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎస్టీల రిజర్వేషన్ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు.
సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్ వేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎస్టీల రిజర్వేషన్ సౌకర్యం యథావిధిగా కొనసాగేలా అవసరమైన వాదనలతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీలకు రాజ్యాంగమే ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని వివరించారు. వాటిని కాపాడే విషయంలో ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.